బైక్ ప్రమాదానికి గురైన టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఆయనకు తల, ఇతర భాగాల్లో తీవ్రమైన గాయాలు లేవని తెలిపారు. అయితే ఇలాంటి కేసుల్లో 48 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని అన్నారు. బైక్ మీద నుంచి పడినప్పుడు ఎక్కడైనా దెబ్బలు తగిలే అవకాశం ఉందని.. అందుకే 48 గంటల పాటు ఆయనను క్లోజ్‌గా మానిటర్ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటికిప్పుడు ఆయనకు ఎలాంటి సర్జరీ చేయబోమని వెల్లడించారు. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం దగ్గర ఉన్న ఆస్పత్రిలో వైద్యం అందించారని.. ఆ తరువాత మెరుగైన ఆస్పత్రి కోసం ఇక్కడికి తీసుకొచ్చారని వైద్యులు తెలిపారు. సాయిధరమ్ తేజ్ ఇక్కడకు వస్తున్నారని సమాచారం వచ్చిన వెంటనే ఇక్కడ ఆయనకు అందించాల్సిన వైద్య సేవలపై డాక్టర్లు సిద్ధమయ్యారని తెలిపారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పైనే ఉన్నారని.. ఆయన కోలుకోవాలని అంతా కోరుకుందామని తెలిపారు. యువ హీరో ఆరోగ్య పరిస్థితిపై రేపు ఉదయం 9 గంటలకు మరోసారి బులెటిన్ విడుదల చేయనున్నారు వైద్యులు
అంతకుముందు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళనను తగ్గించేలా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కీలక ప్రకటన చేశారు. సాయిధరమ్ తేజ్ క్షేమంగా ఉన్నాడని అపోలో ఆస్పత్రి ముందు మీడియాకు వెల్లడించారు. తలకు, శరీరంలో తీవ్ర గాయాలేమీ లేవని ఆయన ప్రకటించారు. రేపు ఉదయం సాధారణ వార్డుకు తరలించేలా ఆయన పరిస్థితి మెరుగవుతుందని వైద్యులు తనకు చెప్పారని అల్లు అరవింద్ చెప్పారు. మరికాసేపట్లో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని అన్నారు. మీడియాలో వస్తున్న వార్తలు, అభిమానుల ఆందోళన నేపథ్యంలోనే.. తాము ముందుగా ఈ విషయాన్ని చెబుతున్నానని అల్లు అరవింద్ అన్నారు.
శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో హీరో సాయిధరమ్ తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లపిోయారు. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్‌తేజ్‌ను 108 సాయంతో సమీపంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. సాయిధరమ్ తేజ్ కుడికన్ను, ఛాతి భాగంలో తీవ్రగాయాలు అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో హెల్మెట్ ఉన్నప్పటికీ సాయిధరమ్ తేజ్‌కు తీవ్ర గాయాలు అయినట్టుగా వార్తలు వచ్చాయి.
మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం సాయిధరమ్ తేజ్‌ను జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ మెడికవర్ ఆస్పత్రికి వెళ్లి సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను ఆరా తీశారు. అనంతరం చిరంజీవి అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీలోని సభ్యులంతా ఆస్పత్రికి చేరుకుని సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు మెగా అభిమానులు సైతం పెద్ద సంఖ్యలో అపోలో ఆస్పత్రి దగ్గరకు చేరుకున్నారు.
Saidharam Tej: సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కు గురైన బైక్ గురించి తెలుసా.. కొన్ని నెలల క్రితమే..
మరోవైపు సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ ఘటనపై మాదాపూర్ పోలీసులు స్పందించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. బైక్‌ను నియంత్రించలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సాయిధరమ్ తేజ్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.