(K.Veeranna,News18,Medak)
ఒక న్యాయ వ్యవస్థలో ఉండి మరొకరికి న్యాయం చెప్పే లాయర్.. తన పెళ్ళికి నిశ్చితార్థం ఈనెల 12వ తేదీన పెట్టుకొని.. పెళ్లి జరిగే సమయానికి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉడాయించాడు. ఆ పెళ్లిని పెళ్లి పీటల వరకు తెచ్చి రూ. 25 లక్షల రూపాయలు, 50 తులాల బంగారం చేతికిరాగానే అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డిలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్ గ్రామానికి చెందిన సిందురెడ్డికి కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన న్యాయవాది మాణిక్ రెడ్డితో భారీ ఖర్చుతో నిశ్చితార్థం జరిగింది. ఇటీవల ఈ నిశ్చితార్థానికి వరుడు సంబంధిత బంధువులు.. వధువు సంబంధిత బంధువులు వచ్చి వాళ్లిద్దరినీ ఆశీర్వదించారు.
ఇక పెళ్లి డిసెంబర్ 12వ తేదీన అనుకున్నారు. ఈ లోపే వరుడికి ఇవ్చాల్సిన కట్నకానుకలు .. బంగారం మొత్తం వధువు తరఫు తల్లిదండ్రులు అతడికి ఇచ్చేశారు. పెళ్లి పనులు మొదలయ్యాయి. పెళ్లి రోజు రానే వచ్చేసింది. అన్ని ఏర్పాట్లు చేసుకొని పెళ్లి మండపం దగ్గరకు అందరూ వచ్చారు. ఇక గంటలో పెళ్లి. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ జరిగింది. పెళ్లి పీటలమీదకు వరుడు వచ్చి కూర్చోవాలి అనగానే అతడిని తీసుకురావడానికి రూంలోకి వెళ్లారు. కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం పెళ్లి కొడుకు కనిపించలేదు. ఆ రూం నుంచి అతడు తన కుటుంబసభ్యులతో జంప్ అయ్యాడు. ఈ విషయాన్ని పెళ్లి కూతురు చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది.
పెళ్లి కూతురు ముస్తాబై మరికొద్ది క్షణాల్లో పెళ్లి మండపానికి వెళ్లే సమయంలో వరుడు పారిపోయిన విషయం తెలియడంతో పెండ్లి కూతురు తో కుటుంబసభ్యులు అంతా తీవ్ర దుఃఖానికి గురయ్యారు. పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో తండ్రి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. మోసపోయానని తెలుసుకున్న వధువు నెత్తీ నోరు బాదుకుంది. నిశ్చితార్థానికి 10 లక్షల రూపాయలు, పెళ్లి ఏర్పాట్లకు 40 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని.. అదే విధంగా కట్నం కింద 25 లక్షల రూపాయలు, 50 తులాల బంగారం ఇవ్వడం జరిగిందని చెప్పారు. మోసం చేసిన న్యాయవాది మాణిక్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని సిందురెడ్డి కోరారు. గతంలో తన మేనమామ కూతురుతో నిశ్చితార్థం అయినట్లు సింధు రెడ్డి తెలిపింది.
ఇలాంటి వాడిని ఒక న్యాయ వ్యవస్థలో ఉండకుండా తగిన చర్య తీసుకొని తనకు న్యాయం చేయాలని సంగారెడ్డి జిల్లా కోర్ట్ ముందు ధర్నా దిగేందుకు సిద్ధమైంది. ఆమెతో పాటు తన నిశ్చితార్థానికి సంబంధించి ఫొటో ఆల్బమ్ ను పట్టుకొని కోర్టు ముందుకు వచ్చింది. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని.. సంగారెడ్డిలో కోర్టులో లాయర్ గా విధులు నిర్వహిస్తున్న మాణిక్ రెడ్డి ని వెంటనే తీసివేయాలని సింధు రెడ్డి ఇ డిమాండ్ చేశారు. ఆయన లాయర్ గా కొనసాగితే మరికొంత మందిని మోసం చేస్తాడని.. అతడి అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, CYBER CRIME, Medak, Telangana crime news, Telugu