news18-telugu
Updated: February 27, 2020, 3:51 PM IST
ఏపీ సీఎం వైఎస్ జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనలో దూకుడు మరింత పెంచారు. మొన్నటికి మొన్న మునిసిపల్ శాఖలో అవినీతిపై కొరడా ఝులిపించిన ఆయన కన్ను ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులపై పడింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతి భారీగా పెరిగిపోయిందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రులపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఏపీలోని 13 జిల్లాలలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులపై దాడులు చేస్తోంది. ఈఎస్ఐ కుంభకోణం నేపథ్యంలో మందులు, వైద్య పరికరాల్లో కొనుగోళ్ల అక్రమాలను వెలికితీసేందుకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఉదయం నుంచి పలు జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మందుల కొనుగోళ్లు, వైద్య పరికరాల కొనుగోళ్లు, వైద్యాధికారుల హాజరు, గైర్హాజరుకు సంబంధించి సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రైవేట్ క్లినిక్లను ఏర్పాటు చేసుకున్న వైద్యులు చాలా మంది ప్రభుత్వ ఆస్పత్రులకు గైర్హాజరు అవుతున్నట్టు గుర్తించినట్టు సమాచారం. అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిస్టర్ లను కూడా క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా మందుల కొనుగోళ్లు, నాసిరకం మందుల కొనుగోలు చేసి పెట్టిన బిల్లులపై ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
దాదాపు 100 మంది ఏసీబీ అధికారులు ఏకకాలంలో అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, గుంటూరు, విజయనగరం, నెల్లూరు, అనంతపురం, తూర్పు గోదావరి, కడపతో పాటు అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరును అధికారులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అధికారులు కీలకమైన అనేక అంశాలను గుర్తించారు. తెనాలిలో ఉన్న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏసీబీ దాడులు చేసింది. ఆస్పత్రిలోని సూపరింటెండెంట్ ఛాంబర్లో ఆర్ఎంఓను విచారించారు.
ఆరోగ్యశ్రీ అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ఏసీబీ అడిషనల్ ఎస్పీ సురేష్ బాబు నేతృత్వంలోని బృందం పలు కీలక రికార్డులను స్వాధీనం చేసుకుంది. అవకతవకల్లో ఒక మహిళా అధికారి హస్తం ఉందన్న అనుమానంతోనే ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
February 27, 2020, 3:08 PM IST