విజయారెడ్డి కదలికలపై పక్కా నిఘా... కొన్ని వారాల ముందు నుంచే...

మృతి చెందిన ఎమ్మార్వో విజయారెడ్డి

తహశీల్దార్ విజయారెడ్డిని హత్య చేసిన నిందితుడు సురేష్... వారంలో రెండు, మూడుసార్లు కార్యాలయానికి వచ్చి ఆమె కదలికలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది.

  • Share this:
    దారుణ హత్యకు గురైన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. నిందితుడు సురేష్ పక్కా పథకం ప్రకారమే విజయారెడ్డిని హతమార్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు ముందు సురేష్‌తో పాటు మరో ఇద్దరు రెక్కీ నిర్వహించారని, మధ్యాహ్న భోజన విరామ సమయంలో కార్యాలయానికి వచ్చే సందర్శకులు తక్కువగా ఉంటారని భావించే... ఆ సమయంలో దారుణానికి ఒడిగట్టినట్టు నిర్ధారణకు వచ్చారు. వారంలో రెండు, మూడుసార్లు కార్యాలయానికి వచ్చి ఆమె కదలికలపై సురేష్ ఆరా తీసినట్టు తెలుస్తోంది.

    ఇంటి నుంచి విజయారెడ్డి ఎన్ని గంటలకు బయలుదేరుతారు, ఆఫీసుకు ఎఫ్పుడొస్తారు, ఒకసారి ఆఫీసుకు వస్తే తిరిగి ఆమె బయటకు వెళతారా అనే విషయాలపై కూడా సురేష్ ఆరా తీసినట్టు సమాచారం. మధ్యాహ్న భోజన విరామ సమయంలో లేదా సాయంత్రం వేళ విజయారెడ్డిని హతమార్చాలని సురేష్ వ్యూహం రచించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

    సోమవారం కూడా కార్యాలయానికి వచ్చి విధులకు వచ్చారా, లేదా అడిగినట్టు తెలుస్తోంది. ఎంతసేపు విజయారెడ్డి కార్యాలయంలో ఉంటారు, మీటింగ్‌లకు వెళతారా అనే దానిపై సురేష్ అక్కడే ఉన్న ఆమె వ్యక్తిగత సిబ్బందిని కలిసి సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆమె కార్యాలయానికి రావడాన్ని గమనించిన సురేష్... గౌరెల్లి గ్రామానికి వెళ్లి పెట్రోల్ సీసా తీసుకొచ్చాడని పోలీసులు భావిస్తున్నారు. ఆ తర్వాతే ఈ హత్యోదంతం జరిగింది.
    First published: