• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • ACB SUBMITTED REPORT TO AP GOVERNMENT ON VIJAYWADA DURGA TEMPLE CORRUPTION NGS

Andhra Pradesh: బెజవాడ దుర్గగుడి అవినీతి లెక్క ఇది..? ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక

విజయవాడ దుర్గగుడి (ఫైల్ ఫోటో)

దుర్గగుడిలో అవినీతి లెక్కలు తేలినట్టేనా..? ఏసీబీ సోదాల్లో ఏం తేలింది..? ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఏముంది? అయితే ఎప్పటిలాగే నివేదికలు చూసి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటుందా..? లేక చర్యలు తీసుకుంటుందా అన్నది చూడాలి.

  • Share this:
    బెజవాడ కనక దుర్గమ్మ ఆలయంలో భారీగా అవినీతి జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారా..? దర్శన టికెట్ల విక్రయం నుంచి ఆలయంలో సరుకుల కొనుగోళ్ల వరకు అవినీతి రాజ్యమేలిందా..? సిబ్బంది నుంచి అధికారుల వరకు అందరి చేతులు అవినీతిలో భాగమయ్యాయా? ఏసీబీ సోదాల్లో ఏం తేలింది.. దీనికి సబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు తమ నివేదికను ప్రభుత్వానికి అందించారు? ఆ నివేదికలో ఏం ఉంది అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    ఏసీబీ దేవాదాయ ప్రధాన కార్యదర్శి, దేవాదాయ కమిషనర్ ఏసీబీ ఆలయాలపై అవకతవకలకు పాల్పడ్డారని.. దానికి ప్రధాన కారణం ఈఓ సురేష్ బాబేనని నివేదికలో వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అక్కడ స్వాధీనం చేసుకున్న రికార్డులు కూడా నివేదికతోపాటు ప్రభుత్వానికి అందజేశారు.

    శానిటేషన్ టెండర్లు, మ్యాక్స్ సంస్థకు సెక్యూరిటీ టెండర్లలో నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు ఇచ్చినట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. అమ్మవారికి భక్తులు ఇచ్చిన చీరలు కూడా గల్లంతైనట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. వీటితో పాటు ప్రసాదాల స్టోర్స్‌లో భారీగా అవకతవకలు జరిగినట్టు నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అమ్మవారి ఆలయంలో జరిగిన కీలక లావాదేవీలకు సంబంధించిన బిల్లులను కూడా ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 30 మంది అధికారులతో కూడిన బృందం సోదాలు పూర్తైన తరువాత ఈ నివేదికను రూపొందించింది.

    ఇక సోదాల విషయానికి వస్తే అభివృద్ధి పనుల బిల్లులు, సరుకుల కొనుగోళ్లు, టికెట్లు, చీరల విక్రయం, తలనీలాల టెండర్లు, సెక్యూరిటీ, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాల చెల్లింపుతో పాటు ఫెర్రీలో స్క్రాప్ విక్రయాలకు సంబంధించిన బిల్లులను అధికారులు సేకరించారు. అలాగే ఫెర్రీలో స్క్రాప్ విక్రయించగా వచ్చిన సొమ్మును ఎక్కడ డిపాజిట్ చేశారనేదానిపై వివరాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన 58 కోట్ల రూపాయల చెల్లింపులపైనే ఎక్కువగా వివారాలు ఆరా తీసినట్టు తెలుస్తోంది.

    ఇటీవల కనకదుర్గమ్మ ఆలయం తరచూ వివాదాల్లోనే నిలుస్తోంది. అమ్మవారి వెండిరథంపై సింహాల ప్రతిమల అదృశ్యమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో దాదాపు నాలుగు నెలల విచారణ అనంతరం నిందితులను పట్టుకున్నారు. చోరీ చేసిన వెండిని కూడా అధికారులు రికవరీ చేశారు. అలాగే దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ప్రత్యేక దర్శనం టికెట్లు ధరలు పెంచడం, కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా భక్తులను అనుమతించడం, ముందస్తు బుకింగ్ లేకుండా ఆలయానికి వచ్చిన వారికి అధిక ధరలకు టికెట్లు విక్రయించి దర్శనానికి అనుమతించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఏసీబీ నివేదికతో ఇంకెన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
    Published by:Nagesh Paina
    First published: