‘ప్రజలకు రక్షణగా ఉంటూ తప్పు చేసిన వారికి శిక్షపడేల చేస్తాం.. ఏ చిన్న తప్పు చేసినా సహించం.. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తాం.. కిందిస్థాయి సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్టు మా దృష్టికి వస్తే కఠినంగా వ్యవహరిస్తాం..’ అంటూ గొప్పలు చెప్పేవారు. ఇప్పుడు వారే ముడుపుల వ్యవహారంలో ఏసీబీకి పట్టుబడుతున్నారు.. పైన పఠారం.. లోన లొటారం అన్నట్టుగా ఉంది పోలీసుల పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలీసుల శైలిపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. బోదన్ రూరల్ సీఐ రాకేశ్, బాన్సువాడ రూరల్ సీఐ టాటాబాబు లంచం తీసుకు ఏసీబీకి చిక్కారు.. తాజాగా కామారెడ్డి పట్టణ సిఐ జగదీష్ ఐపీఎల్ బెట్టింగ్ కేసులో లంచంతీసుకున్న విషయంలో ఏసీబీ అదికారులు అదుపులోకి తీసుకున్నారు.. బెట్టింగ్ కేసు విషయంలో సంబంధం ఉన్న వారందరిపై ఏసీబీ అధికారులు దృష్టి పెట్టడంతో ఉమ్మడి జిల్లాలోని పోలీసుల గుండెల్లో రైళ్లుపరుగెడుతున్నాయి.
కామారెడ్డి పట్టణ సీఐ జగదీష్‌పై అవినీతి అక్రమాల ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. బెట్టింగ్ కేసులో ఆయన అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడైంది. దీంతో సీఐ జగదీష్‌ను అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహణలో మధ్యవర్తిగా వ్యవహరించిన సుజయ్‌ను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు అతనినీ అరెస్టు చేశారు. వీరిద్దరి వాంగ్మూలాలను సేకరించిన ఏసీబీ అధికారులు డీఎస్పీ పాత్ర, పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు ఎస్ఐల పాత్రపైనా లోతుగా విచారణ చేపట్టారు.
పలువురి పరారీ..
వీరితో పాటు మరి కొంతమంది సిబ్బంది పాత్ర కూడా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది గుండెల్లో గుబులు రేకెత్తుతోంది. ఏసీబీ అధికారుల నుంచి పిలుపు ఎవరికి వస్తుందోనని ఉలిక్కిపడుతున్నారు. డీఎస్పీ కార్యాలయంలో రెండు రో జులు విచారణ కొనసాగించిన ఏసీబీ అధికారుల తీరుతో ఇద్దరు ఎస్ఐలు సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లడంతో పట్టణ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
అదే కొంపముంచిందా..?
ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరిం చిన సెల్‌ఫోన్‌షాపు నిర్వాహకుడు సుజయ్‌తో సీఐ, డీఎస్పీకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలో ఏసీబీ అధికారులు విచారణ చేపడుతుండగా.. సదరు మధ్యవర్తి తన వాంగ్మూల్యంలో అత్యుత్సాహం ప్రదర్శించినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు విచారణను మరింత లోతుగా చేపట్టినట్టు తెలిసింది. పలువురు నాయకులతో పరిచయాలు ఉన్నాయంటూ ప్రచారం చేసుకునే ఓ వ్యక్తి.. పోలీసుల ముడుపుల వ్యవహారం చూసుకోవాలని సూచించడంతో సదరు మధ్యవర్తి అన్నీ తానై చూసుకున్నట్టు సమాచారం. ఏదైనా కేసుకు సంబంధించి ముడుపులు వస్తే.. సదరు వ్యక్తికి పోలీసులు వివరాలు అందించగానే ముడుపులు తీసుకుని తన కమీషన్ తాను తీసుకునే వాడని తెలిసింది.
ఇదే క్రమంలో ఐపీఎల్ బెట్టింగ్ కేసులో సైతం పట్టుబడ్డ నిర్వాహకులతో మాట్లాడుతూ.. అధికంగా ఒత్తిడి చేయడం వల్లే సీఐ, డీఎస్పీల మెడకు ఈ కేసు చుట్టుకున్నట్లు విశ్వనీయవర్గాల సమాచారం. తనకు అధిక కమీషన్ వస్తుందని అత్యాశకు పోవడం డీఎస్పీ, సీఐల కంటే ఎక్కువగా నిర్వాహకులను ఒత్తి డికి గురిచేయడంతోనే ఏసీబీ అధికారులను ఆశ్రయించారని కామారెడ్డి పట్టణంలో తీవ్ర చర్చ జరుగుతోంది.
డీఎస్పీ పాత్రపై విచారణ : ఐపీఎల్ బెట్టింగ్ కేసు వ్యవహారంలో డీఎస్పీ పాత్రపై ఏసీబీ అధికారులు ఆదివారం రాత్రి 8 గంటల వరకు విచారణ చేపట్టారు. రెండు రోజులు డీఎస్పీ కార్యాలయంలో సోదాలు కొనసాగించడంతో పాటు డీఎస్పీ లక్ష్మీనారాయణను సుమారు 12 గంటల పాటు విచారించారు. పలు అంశాల పై డీఎస్పీని విచారించారు. డీఎస్పీ కార్యాలయంలో పలుకీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకు న్నట్లు సమాచారం. డీఎస్పీ కార్యాలయంలో నిరంతరంగా ఏసీబీ సోదాలు కొనసాగుతుండడంతో పోలీసు అధికారులు ఆందోళనకు గురయ్యారు.
డీఎస్పీ అక్రమ ఆస్తులపై పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఆ వివరాలను ఉన్నతాధికారులకు నివేదించి వారి సూచనల మేరకు విచారణను లోతుగా చేపట్టే అవకాశం ఉంది. విచారణ పూర్తయ్యే వరకు వివరాలు వెల్లడించలేమని ఏసీబీ అధికారులు తెలిపారు. మీడియాను కూడా గత మూడు రోజులుగా అనుమతించడం లేదు. ఏసీబీ ఇన్చార్జి ఏసీబీ ఆనంద్‌కుమార్ రోజుకు ఒకసారి మాత్రమే మీడియా వద్దకు వచ్చి విచారణ కొనసాగుతోందని, పూర్తి విచారణ అనంతరమే వివరాలు వెల్లడిస్తామని, తమకు కీలకమైన సమాచారం లభించిందని చెప్పడం గమనార్హం... విచారణ పూర్తయిన తర్వాతనే ఐపీఎల్ బెట్టింగ్ కేసు వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందనే అసలు నిజాలు వెలుగులోకి రానున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Nizamabad, Police, Telangana, Telangana News