సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న యువ వైద్యురాలు ఓవర్‌డోస్ ఇంజెక్షన్ తనకు తాను చేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తన చావుకు ఎవరూ కారణం కాదని.. తనంతట తాను తీసుకున్న నిర్ణయమేనని ఆమె సూసైడ్ నోట్లో రాసింది. హాస్పిటల్లో సీనియర్ డాక్టర్స్ పెడుతున్న టార్చర్ తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పెను విషాదం నింపింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మహువాకు చెందిన డాక్టర్ జిగిషా (26) సూరత్‌లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో వైద్యురాలిగా పనిచేస్తోంది. హాస్పిటల్ వాళ్లు కల్పించిన క్వార్టర్స్‌లో ఉంటూ డ్యూటీకి వెళ్లి వస్తుండేది. జిగిషా ఫస్టియర్ రెసిడెంట్ డాక్టర్. గైనకాలజీ విభాగంలో విధులు నిర్వర్తిస్తోంది. హాస్పిటల్ క్వార్టర్స్‌లోని ‘కె’ బ్లాక్‌లో ఉండేది. ఆమె తల్లిదండ్రులిద్దరూ టీచర్స్. జిగిషాకు ఒక సోదరి ఉంది. ఆత్మహత్యకు పాల్పడే ముందు జిగిషా తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. అయితే.. ఆ తర్వాత ఆమె తన ఫోన్‌ను స్విఛాప్ చేసినట్లు విచారణలో తేలింది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక కొన్ని నెలల క్రితం జిగిషా ఇంటికి కూడా వెళ్లినట్లు తెలిసింది.
ఇటీవల తిరిగి డ్యూటీలో చేరిన జిగిషాకు సీనియర్ల నుంచి వేధింపులు ఆగలేదు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె అనస్థీషియా ఇంజెక్షన్ ఓవర్‌డోస్ తీసుకోవడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ పరిణామంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలియని తల్లిదండ్రులు మరుసటి రోజు కూతురికి కాల్ చేస్తే ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విఛాప్ వచ్చింది. దీంతో.. కంగారుపడిన తల్లిదండ్రులు ఆమె ఉంటున్న క్వార్టర్స్‌కు వెళ్ళి చూడగా జిగిషా తన గదిలో విగత జీవిగా కనిపించింది.
యువ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హాస్పిటల్ యాజమాన్యం, సిబ్బందిని విచారిస్తున్నారు. ఆమె తన సూసైడ్ నోట్లో ఎవరి పేరు ప్రస్తావించనప్పటికీ కొందరు వ్యక్తులు ఆమెను టార్గెట్ చేసి ఇబ్బందిపెట్టేవారని, అందువల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని జిగిషా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు జిగిషా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం.. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. జిగిషా మృతితో ఆమె సోదరి కుప్పకూలిపోయింది. ఆమె మృతదేహంపై పడి రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Gujarat, Surat, Woman suicide