Love Affair: ప్రేమకు అడ్డొస్తున్నాడని.. లవర్ సోదరుడిని చంపిన ప్రేమికుడు

ప్రతీకాత్మక చిత్రం

అతడు యూట్యూబ్ లో సంచలనం. బైకు ఎక్కి స్టంట్లు వేశాడంటే ఎవరైనా అదరహో అనాల్సిందే. యూట్యూబ్ లో మనోడికి వీర ఫాలోయింగ్ ఉంది. ఆ స్టంట్లను చూసే ఒకమ్మాయి లవ్ లో పడింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.

 • News18
 • Last Updated :
 • Share this:
  తన ప్రేమకు అడ్డొస్తున్నాడనే కారణంతో ప్రేమికురాలి సోదరుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడో ప్రేమికుడు. ఎన్ని సార్లు చెప్పినా వినకుండా ప్రతి విషయంలో తనకు అడ్డు చెపుతున్నాడని భావించి.. అతడిని హతమార్చాడు. గుట్టుచప్పుడు కాకుండా అతడిని హతమార్చాడే గానీ.. తర్వాత విచారణలో అసలు నిజం తెలిసి జైలు ఊసలు లెక్కపెడుతున్నాడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఘటనలో నిందితుడు ప్రముఖ యూట్యూబర్ కావడం గమనార్హం. బైక్ స్టంట్ల పేరుతో అతడు చేసే విన్యాసాల వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి.

  విషయానికొస్తే.. . అద్భుత బైక్ స్టంట్లతో ఆకట్టుకునే ఢిల్లీకి చెందిన నిజాముల్ ఖాన్ యూట్యూబ్ లో ఫేమస్. ఆ యువకుడు చేసే స్టంట్లు చూసేవారిని అబ్బురపరుస్తాయి. యూట్యూబ్ లో అతడు పోస్టు చేసిన వీడియోలు, చేసిన స్టంట్లకు గానూ 9 లక్షల మందికి పైగా సబ్ స్క్రైబర్లను సంపాదించుకున్నాడు. ఆ వీడియోల ద్వారా ఎంతో పాపులర్ అయ్యాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ గా కూడా అతడికి మంచి పేరుంది. అయితే ఈ క్రమంలో అతడు ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెతో తరుచూ ఫోన్లలో మాట్లాడటం, రోజూ కలుస్తుండటం చేసేవాడు. ఈ విషయం ఆ యువతి ఇంట్లో తెలిసింది.

  విషయం తెలుసుకున్న ఆ యువతి సోదరుడు కమల్ శర్మ (26).. నిజాముల్ ఖాన్ తో తిరగొద్దని తన సోదరికి చెప్పాడు. అయినా ఆమె వినలేదు. పలుమార్లు చెప్పి చూసిన కమల్ శర్మ.. ఓసారి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. నిజాముల్ తో ఇంకోసారి తిరిగినట్టు తెలిస్తే చంపేస్తామని బెదిరించాడు. అంతకుముందు కూడా నిజాముల్ తో ఇదే విషయం చెప్పాడు కమల్ శర్మ. దీంతో కోపం పెంచుకున్న నిజాముల్ ఖాన్.. అతడిని ఎలాగైనా అంతం చేయాలని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా.. అక్టోబర్ 28న కమల్ శర్మ.. స్థానికంగా ఉండే ఇస్కాన్ ఆలయం గుండా వెళ్తుండగా.. మోటార్ సైకిల్ మీద వెంబడించి.. వెంబడించి.. తుపాకీతో కాల్పులు జరిపాడు. అంతే.. రక్తపు మడుగులో కమల్ శర్మ. రోడ్డు మీద విఘతజీవిగా పడి ఉన్నాడు. అదే సమయంలో నిందితుడు కూడా అక్కడ్నుంచి ఉడాయించాడు.

  బుల్లెట్ గాయాలతో రోడ్డు మీద పడి ఉన్న కమల్ శర్మను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ అతడు చనిపోయాడని తేల్చారు వైద్యులు. కమల్ శర్మ సోదరుడు నరేశ్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు రాగానే నరేశ్ జరిగిందంతా పోలీసులకు వివరించాడు. దీంతో.. నిజాముల్ ఖానే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలుసుకున్నారు.

  నిజాముల్ ఖాన్ ను పట్టుకుని విచారించగా.. అతడు నిజం ఒప్పుకున్నాడు. యూట్యూబ్ వీడియోల ద్వారా వచ్చిన సంపాదనతో పాటు.. స్నేహితుల సాయంతో ఈ హత్యకు పాల్పడ్డానని చెప్పాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు.. దీనితో మృతుడి సోదరికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Srinivas Munigala
  First published: