ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు సమాచారం రాగానే ఇంటిని పరిశీలిస్తారు. పరిశీలన క్రమంలో ఇళ్లంతా చిందరవందరగా.. బీరువాలో ఉన్న సామాన్లు కిందపడేసి.. వస్తువులను పగలకొట్టి నానా హంగామా చేసి దొంగలు వారి పని పూర్తి చేసుకొని వెళ్తారు. సాధారణంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు ప్రారంభిస్తారు. కానీ ఓ కేసులో పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. తన ఇంట్లో దొంగతనం చేశాడని భార్యే (Wife) తన భర్తపై కేసు (Case on Husband) పెట్టింది. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన హైదరాబాద్‌లోని (Hyderabad) శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ ఎ.శ్రీధర్‌కుమార్ కథనం ప్రకారం.. ఊట్‌పల్లిలో నివాసముంటున్న ఉపాధ్యాయురాలు రావుల అనురాధతో ఫరూక్‌నగర్ మండలం షాద్‌నగర్ వాసి తీగలపల్లి మధుసూదనాచారితో 17 ఏళ్ల కిందట పెళ్లైంది. సంతానం లేకపోవడంతో పాటు అనురాధకు అనారోగ్యం కారణంగా వీరు వేర్వేరుగా ఉంటున్నారు. అనురాధ తన దత్తపుత్రుడు అనిరుధ్‌తో కలిసి ఊట్‌పల్లిలో ఉంటోంది. జూన్ ఒకటో తేదీన ఇంటికి తాళం వేసి అనిరుధ్‌తో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది.
తిరిగి జూన్ 7న ఇంటికి వచ్చి చూడగా.. ఇంటి తలుపు తాళం విరగొట్టి ఉంది. బీరువా కూడా తెరిచి ఉంది. బీరువాలోని 10 తులాల బంగారు నగలు, రూ.5 లక్షల నగదు కనిపించలేదు. చుట్టుపక్కల వారిని ఆరా తీయగా.. జూన్ 4న అర్ధరాత్రి సమయంలో అనురాధ భర్త మధుసూదనాచారి ఇంటికి వచ్చాడని చెప్పారు. దీంతో భర్తే తన నగలు, నగదు తీసుకెళ్లి ఉంటాడని భావించి.. వాటిని తిరిగి ఇవ్వాలని కోరింది. ఎంతకూ అతడి నుంచి స్పందన లేకపోవడంతో గురువారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వింత దొంగతనం..
ఇటీవలె హైదరాబాద్లో ఓ దొంగతనం కేసు పోలీసులకు సవాలుగా మారింది. నగర శివారులోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్‌గూడ గ్రామంలో పల్లె రాములు గౌడ్ అతని భార్య పల్లె సునీత, కుమారుడు మణికంఠ, కోడలు తేజస్వి ఒకే ఇంట్లో నివాసముంటారు. ఇటీవల పల్లె రాములు గౌడ్ భార్య సునీత తన బంధువులకు సంబంధించి ఓ ఫంక్షన్ కు వెళ్లింది. మిగతా కుటుంబసభ్యులు ఇంట్లోనే ఉన్నారు. ఆమె ఊరి నుంచి తిరిగి వచ్చి ఇంట్లోని బీరువాలో ఉన్న బాక్సుల్లో కిలో బంగారం దాచి పెట్టింది. అవి ఆమె కు సంబంధించిన బంగారు ఆభరణాలులు దాచి పెట్టింది. ప్రతీ రోజు ఆమె వాటిని చెక్ చేస్తూ ఉండేది.
అయితే రెండు రోజుల క్రితం ఎప్పటి లాగే ఆమె బీరువా తెరిచి తన బంగారాన్ని చూసింది. అక్కడ బాక్సులు ఉన్నాయి. కానీ అందులో రూ.50 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు మాత్రం కనిపించలేదు. దీంతో ఆమెకు కాళ్లు, చేతులు ఆడలేదు. వెంటనే కుటుంబసభ్యులను అడిగింది. ఎవరైనా తీశారా అని.. కానీ వారు తీయలేదు అనగానే వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. వారు వచ్చి బీరువాలను పరిశీలించారు. తాళం, బీరువా పగలకుండా అందులో బంగారం అపహరణకు గురైందని బాధితురాలు పోలీసులకు చెప్పింది. 24 గంటల పాటు ఇంట్లో ఎవరో ఒకరుంటారు. బీరువా తాళాలు ఇంట్లోనే ఉన్నాయి. బీరువాలోని బాక్సులూ ఉన్నాయి. కానీ, బాక్సుల్లోని బంగారం మాత్రం చోరీకి గురైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Theft, Wife, Wife and husband