హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime news: సాధువులుగా భిక్షాటనకు వచ్చారు.. మాటలు కలిపారు.. సీన్​ కట్​ చేస్తే రూ. 37 లక్షలు టోపీ.. 

Crime news: సాధువులుగా భిక్షాటనకు వచ్చారు.. మాటలు కలిపారు.. సీన్​ కట్​ చేస్తే రూ. 37 లక్షలు టోపీ.. 

అరెస్టయిన నకిలీ బాబాలు

అరెస్టయిన నకిలీ బాబాలు

భిక్షాటనకు వెళ్లి నాగదోషం ఉన్నదని ఓ ట్రాన్స్ పోర్ట్ వ్యాపారిని భయపెట్టి పూజల పేరిట మొదట వేలు వసూలు చేశారు. బాధితుడి అమాయకత్వం గమనించి మరికొన్ని పూజల పేరిట దొంగ బాబాలు  లక్షలు దోచుకున్నారు

మోసగాళ్లు ఈ మధ్య బాబాల అవతారం ఎత్తారు.  ఓ కార్యాలయానికి భిక్షాటనకు వెళ్లి నాగదోషం ఉన్నదని ఓ ట్రాన్స్ పోర్ట్ వ్యాపారిని భయపెట్టి పూజల పేరిట మొదట వేలు వసూలు చేశారు. బాధితుడి అమాయకత్వం గమనించి మరికొన్ని పూజల పేరిట దొంగ బాబాలు  లక్షలు దోచుకున్నారు. ఎల్బీనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రాంతానికి చెందిన కొండల్‌రెడ్డి పేలుడు పదార్థాల తయారీ ఫ్యాక్టరీ, ట్రాన్స్‌పోర్టు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. రెండేండ్ల క్రితం కొండల్‌రెడ్డి సాయంత్రం వేళ తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి వస్తుండగా ఎదురుగా పాము రోడ్డు దాటింది. ఇది గమనించి ఆందోళనకు గురై బైక్‌పై నుంచి కిందపడ్డాడు. ముఖానికి చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. డిసెంబర్‌లో అతడు ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో ఉన్నారు. ఆ సమయంలో భిక్షాటన కోసం ఇద్దరు వ్యక్తులు సాధువులుగా వచ్చారు. వారు భిక్ష అడిగి కొండల్‌రెడ్డి గాయాల గురించి ఆరా తీశారు. వ్యాపారి జరిగింది చెప్పడంతో మీకు, మీ కుటుంబానికి సర్పదోషం, నాగదోషం ఉన్నదని, అది మీ కుటుంబాన్ని చంపేస్తుందని బెదిరించారు. నివారణకు పూజ చేయాలని నమ్మించారు. ఇందుకు ముందుగా ఆ ఇద్దరు సాధువులు కొండల్‌రెడ్డి ఇంటికి వెళ్లి రూ.41 వేలు తీసుకొని పూజ చేశారు.

ముఠాలోని మరికొందరిని తీసుకొచ్చి..

పూజల సందర్భంలో కొండల్‌రెడ్డి, ఆయన కుటుంబం అమాయకత్వాన్ని గమనించారు దొంగ బాబాలు. దీంతో మరో పథకం వేశారు.  ఇంకా కొన్ని పూజలు చేయాలని, అప్పుడే మీకు మంచి జరుగుతుందని నమ్మించి ముఠాలోని మరికొందరిని తీసుకొచ్చి అధికారి కొండల్‌రెడ్డి ఇంట్లో పూజలు జరిపారు.

ఆ తర్వాత రాజస్థాన్‌ వెళ్లారు. అక్కడి నుంచి మీకు ఈ రోజు మంచి జరగదు.. ప్రమాదం పొంచి ఉన్నదంటూ రోజుకో కహాని చెప్పి భయపెట్టడం ప్రారంభించారు. ఇక పూజలకంటూ దాదాపు రూ. 37.71 లక్షలు దఫదఫాలుగా వసూలు చేశారు బాబాలు. ఇక అంతటిలో ఆగకుండా పూజలకు ఇంకా డబ్బులు కావాలంటూ బెదిరిస్తుండటంతో బాధితుడికి అసలు విషయం అర్థమైపోయింది. దీంతో కొండల్‌రెడ్డి రాచకొండ పోలీసులను ఆశ్రయించారు.

భువనగిరి ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ రాములు బృందం పలు కోణాల్లో దర్యాప్తు చేసి రాజస్తాన్​ షిరోయి గ్రామానికి చెందిన సంజునాథ్‌, గోరఖ్‌నాథ్‌, రామ్‌నాథ్‌, జోనాథ్‌, గోవింద్‌నాథ్‌, పున్నారామ్‌, వాస్నరామ్‌, ప్రకాశ్‌ జోటా ముఠాగా ఏర్పడి తెలంగాణ, తమిళనాడుతోపాటు చాలా రాష్ట్రాల్లో సాధువులు, బాబాలుగా చెలామణి అవుతూ మోసాలకు పాల్పడ్డారని తేలింది. ఇందులో ఏడుగురు అరెస్టు కాగా ప్రధాన సూత్రధారులు సంజునాథ్‌, గోరఖ్‌నాథ్‌, హవాలా వ్యాపారులు ప్రకాశ్‌ ప్రజాపతి, రమేశ్‌ ప్రజాపతి పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.8.30 లక్షల నగదు, 12 మొబైల్‌ ఫోన్లు, రుద్రాక్ష మాలలు, అఘోరా మాలలు, నగదు లెక్కింపు మెషీన్లను స్వాధీనం చేసుకున్నారు.

First published:

Tags: Crime news, Hyderabad, Yadadri

ఉత్తమ కథలు