Sad: ఈ అమ్మాయికి వచ్చినట్టుగా చావు మరెవరికి రాకూడదు.. ఈ ఘటన జరిగి ఉండకూడదు..

రక్షిత (ఫైల్ ఫొటో)

డిగ్రీ చదివే స్థోమత లేక ఓ యువతి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబం ఆర్థికంగా చెప్పుకోదగిన స్థితిలో లేకపోవడంతో ఇక చదివే పరిస్థితి లేదని ఆ యువతి క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.

  • Share this:
    దావణగెరె: డిగ్రీ చదివే స్థోమత లేక ఓ యువతి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబం ఆర్థికంగా చెప్పుకోదగిన స్థితిలో లేకపోవడంతో ఇక చదివే పరిస్థితి లేదని ఆ యువతి క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని ఉజ్జప్ప వదెరహళ్లి గ్రామానికి చెందిన చంద్రమ్మ, నాగరాజప్ప భార్యాభర్తలు. వీరి కుమార్తె రక్షిత ఇటీవలే పీయూసీ పూర్తి చేసి డిగ్రీ చదువుకోవాలని ఆశపడింది. అయితే.. ఈ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. రక్షిత తండ్రి నాగరాజప్ప మూడేళ్ల క్రితం ఎలక్ట్రిక్ షాక్‌ కారణంగా మృతి చెందాడు. అప్పటి నుంచి రక్షిత తల్లి చంద్రమ్మ కూలోనాలో చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. కూతురిని పీయూసీ చదివించింది. అయితే.. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల చంద్రమ్మ ఉపాధి కోల్పోయింది. అప్పటి నుంచి ఈ కుటుంబానికి ఆర్థిక సమస్యలు మరింత పెరిగాయి. రక్షిత చదువులో చాలా చురుగ్గా ఉండేది. పదవ తరగతిలో మంచి మార్కులతో పాస్ కావడంతో కూతురిని బాగా చదివించాలని చంద్రమ్మ భావించింది. అందుకే.. భర్త చనిపోయినప్పటికీ కూతురు చదువును కొనసాగించేందుకు అవసరమైన డబ్బును కష్టపడి సంపాదించింది. చంద్రమ్మ ఆశించినట్టుగానే పీయూసీ కూడా రక్షిత మంచి మార్కులతో పాసైంది. అయితే.. లాక్‌డౌన్ రూపంలో ఈ కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు వెంటాడాయి.

    చంద్రమ్మ పని కోల్పోవడంతో రక్షితను డిగ్రీ చదివించడం ఆమెకు సవాల్‌గా మారింది. పరిస్థితులు అనుకూలంగా లేవని, ఇక చదువు ఆపేసి ఇంటి వద్దే ఉండాలని చంద్రమ్మ తన కూతురు రక్షితతో చెప్పింది. ఈ పరిణామం రక్షితను తీవ్రంగా బాధించింది. తోటి వారంతా డిగ్రీ చదువుకునేందుకు సిద్ధమవుతుంటే తనకు మాత్రం కుటుంబ కష్టాల కారణంగా ఆ అవకాశం దక్కలేదని గత కొన్నిరోజులుగా రక్షిత తీవ్ర మనస్తాపం చెందింది. ముభావంగా ఉంటూ ఇంటికే పరిమితమైంది. తోటి స్నేహితురాళ్లతో కలవడమే మానేసింది. బీఏ లేదా బీకామ్ చదవాలని రక్షిత భావించింది. కానీ.. పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉండటంతో నిస్సహాయ స్థితిలో చదువుపై ఇష్టాన్ని చంపుకోలేక, ఇంటి పట్టున ఉండలేక తనలో తాను కుమిలిపోయింది.

    ఇది కూడా చదవండి: Tragedy: మనమరాలిని ఎత్తుకుని డాబాపైకి వెళ్లి బట్టలు ఆరేస్తుండగా ఊహించని ఘటన..

    ఈ క్రమంలోనే.. క్షణికావేశంలో తల్లి ఇంట్లో లేని సమయంలో రక్షిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి పనికి వెళ్లి తిరిగి ఇంటికొచ్చి చూసేసరికి రక్షిత ఉరికి వేలాడుతూ విగత జీవిగా కనిపించింది. కూతురిని ఆ స్థితిలో చూసి చంద్రమ్మ కన్నీరుమున్నీరయింది. తమ కష్టాలే కూతురిని చంపేశాయంటూ గుండెలవిసేలా రోదించిది. ఈ కష్టం మరే కుటుంబానికి రాకూడదని ఏడుస్తున్న చంద్రమ్మను చూసి చూపరులు కంటతడి పెట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: