• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • A THEFT GANG TARGETING ONLY LOVERS IN PRAKASAM DISTRICT ANDHRA PRADESH CR

ప్రకాశం జిల్లాలో ‘దండుపాళ్యం’ బ్యాచ్... ఏకాంతంగా ఉండే ప్రేమజంటలను టార్గెట్ చేస్తూ...

ప్రతీకాత్మక చిత్రం

పేర్నమిట్ట-మంగమూరు రోడ్డులో ఏకాంతంగా గడుపుతున్న ప్రేమజంటపై దాడి... నగలు, డబ్బులు దోచుకుని పరార్... ఇద్దరూ వివాహితులు కావడంతో ఫిర్యాదు చేయడానికి ముందుకు రాని ప్రేమికులు...

  • Share this:
ప్రేమ జంటలే లక్ష్యంగా ప్రకాశం జిల్లాలో ఒంగోలు మండలం, గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోనూ కొన్ని ముఠాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇంట్లో తెలియకుండా రహస్యంగా కలుసుకోవడానికి వచ్చిన ప్రేమ జంటలను టార్గెట్ చేస్తూ వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, వారి దగ్గర నుంచి దొరికినంత డబ్బులు, నగలు దోచుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా, ఫిర్యాదు చేసేందుకు ప్రేమికులు వెనుకాడుతున్నారు. కుటుంబం పరువు పోతోందని, ప్రియుడితో వెళ్లామని తెలిస్తే తల్లిదండ్రులు దండిస్తారనే భయంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకురావడం లేదు. ఇలా జరుగుతున్న విషయం తెలిసినా, లిఖిత పూర్వక ఫిర్యాదులు రాకపోవడంతో వీటిని పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రేమికుల వీక్‌నెస్‌ను అదునుగా తీసుకున్న బ్యాచ్ ఒకటి మూడురోజుల క్రితం జరిగిన ఒంగోలు సమీపంలో దారుణానికి పాల్పడింది. నాగులుప్పలపాడు మండలానికి చెందిన ఇద్దరు వివాహితులు ఏకాంతంగా పేర్నమిట్ట-మంగమూరు రోడ్డులోని ఓ జామాయిల్ తోటలో ఉండగా.. వారిని ముగ్గురు యవకులు వెంబడించారు. ఏకాంతంగా గడుపుతున్న సమయంలో వారిపై దాడిచేసి, యువకుడిని బెల్టుతో తీవ్రంగా కొట్టారు. తర్వాత అతని వద్ద నగదు దోచుకున్నారు. బెల్టుతో అతని కాళ్లు చేతులు కట్టేసి, మహిళ ఒంటి మీద ఉన్న బంగారాన్ని దోచుకున్నారు. ఈ ఘటన జరుగుతుండగానే... కట్లు విప్పుకున్న యువకుడు దగ్గరలోని మంగమూరు గ్రామంలోకి వెళ్లి తమను రక్షించాల్సిందిగా గ్రామస్థులను కోరాడు. గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.


దాడికి గురైన యువకుడు, మహిళ ఇద్దరూ వివాహితులు కావడంతో విషయం బయటికి తెలిస్తే. తమ కాపురాలు కూలిపోతాయని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు... బాధితుడిని స్టేషన్‌కి పిలిచి విచారణ జరిపారు. అయితే అతను మొదట నిందితులను గుర్తుపడతానని చెప్పి, తర్వాత తనను వదిలేయమని పోలీసులను ప్రాథేయపడడం విశేషం. నాలుగు నెలల వ్యవధిలో ముగ్గురు ఎస్పీలు మారడంతో పోలీస్ శాఖలో నిర్లిప్తత ఏర్పడింది. ఎన్నికల విధులపై దృష్టిపెట్టి.. నగరం శివారు ప్రాంతాల్లో ఏమి జరుగుతుందో నిఘా వేయడంలో విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. గతంలో చీమకుర్తి ప్రాంతానికి చెందిన కొందరు ఓ గ్యాంగ్ ఏర్పడి.. నాగార్జున సాగర్ కాలువపై తిరుగుతూ జంటలను బెదిరించి డబ్బులు దోచుకోవడం, అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనలు జరిగాయి. దీంతో మంగమూరు ఘటనకు.. ఆ గ్యాంగ్ కి సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


సింగరాయకొండ సమీపంలో ఆటో డ్రైవర్, తన ఆటోలో ప్రయాణిస్తున్న మహిళను బెదిరించి బంగారం చైన్ లాక్కును వెల్లిపోయిన ఘటన చోటు చేసుకుంది. దీంతోపాటు.. కొన్ని వారాల క్రితం చీమకుర్తి పట్టణంలో పట్టపగలు ఇంట్లోకి చొరబడి వృద్ధ దంపతులను దారుణంగా హత్యచేసిన నిందితులను పోలీసులు ఇప్పటి వరకూ పట్టుకోలేదు. ఎవరు ఈ దురాగతానికి పాల్పడ్డారో సాక్ష్యాలు కూడా సంపాదించలేకపోయారు. ఒక ప్రొఫెషన్ గ్యాంగ్ మాత్రమే ఇలా హత్యచేసి.. సంఘటనా స్థలంలో ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా తప్పించుకుపోగలదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే చనిపోయింది వృద్ధ దంపుతులు కావడం, వారికి అయిన వాళ్లు ఎవరూ లేకపోవడంతో ఈ కేసును పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులకు ఎదురవుతున్న ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని, వరుస అఘాయిత్యాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌కు స్థానికులు ‘దండుపాళ్యం’ గ్యాంగ్ అని పేరు పెట్టి పిలుస్తుండడం విశేషం.

డి. లక్ష్మీనారాయణ, న్యూస్18 ప్రకాశం జిల్లా ప్రతినిధి

First published: