ముంబై: మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మథేరన్‌లో గోరేగావ్‌కు చెందిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఓ మహిళ మొండెం కనిపించడంతో పర్యాటకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆమె వయసు ఇంచుమించు 30 ఏళ్లు ఉండొచ్చని పోలీసులు చెప్పారు. వీకెండ్‌లో మథేరన్‌కు చాలామంది టూరిస్టులు వస్తుంటారు. శని, ఆది వారాలు మథేరన్ పర్యాటకులతో సందడిగా ఉంటుంది. అలాంటిది.. గత ఆదివారం మహిళ శవం, అదీ తల లేని మృతదేహం కనిపించడంతో అందరూ భయాందోళనలకు లోనయ్యారు. ఆదివారం ఉదయం 11 గంటలకు మథేరన్‌లోని లాడ్జిలో మహిళ మృతదేహం కనిపించింది. మథేరన్ రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న లాడ్జిలో ఈ ఘటన జరిగింది. మహిళ తల కనిపించలేదు. అంతేకాదు.. ఒంటిపై నూలుపోగు లేని స్థితిలో ఆ మహిళ మృతదేహం కనిపించడం శోచనీయం. ఈ కేసును విచారించిన పోలీసులు ఆ మృతదేహం పూనమ్ పాల్ అనే మహిళ అని తేల్చారు. కత్తితో ఆమె తలను కోసి దారుణంగా హత్య చేశాడు.
ఆమె ఎవరో ఏంటో తెలియకుండా ఉండాలని ఆమె ఒంటి మీద బట్టలు, ఆమెకు సంబంధించిన వస్తువులను హంతకుడు తీసుకెళ్లిపోవడం గమనార్హం. పోలీసులు లాడ్జిలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా పూనమ్ పాల్, ఆమెతో పాటు వచ్చిన వ్యక్తి మాస్క్ పెట్టుకుని కనిపించారు. లాడ్జి సిబ్బంది ఆధార్ గానీ, ఎలాంటి ఐడెంటిటీ కార్డు అడగకుండానే రూం ఇవ్వడంతో హంతకుడిని గుర్తించడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది. పైగా.. పూనమ్ పాల్‌తో పాటు ఆమెతో వచ్చిన వ్యక్తి కూడా ఇద్దరి పేర్లు లాడ్జి సిబ్బందికి ఫేక్‌గా చెప్పడంతో అతనెవరో కనిపెట్టడం సవాల్‌గా మారింది. అయితే.. ఎట్టకేలకు పోలీసులు ఓ హ్యాండ్‌బ్యాగ్‌ను గుర్తించారు. రాయ్‌ఘడ్ జిల్లా పోలీసులు ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. హత్య జరిగిన ఈ లాడ్జికి సుమారు 50 మీటర్ల దూరంలో హ్యాండ్ బ్యాగ్ లభ్యమైందని తెలిపారు. ఈ బ్యాగ్‌లో గోరేగావ్‌కు చెందిన మెడికల్ ప్రిస్క్రిప్షన్ కనిపించిందని.. గోరేగావ్ పోలీసులకు సమాచారం అందించామని పోలీసులు చెప్పారు. పూనమ్ పాల్ కనిపించకుండా పోయిందని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
లాడ్జి ఓనర్ కేతన్ రమణే మాట్లాడుతూ.. మార్నింగ్ సర్వీస్‌లో భాగంగా తాను వాళ్ల రూంకు వెళ్లగా ఆ మహిళ మొండెం కనిపించడంతో షాకయ్యానని, వెంటనే పోలీసులకు సమాచారం అందించానని చెప్పాడు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. దస్తూరి నాకా ఎంట్రీ పాయింట్‌కు ఈ జంట శనివారం సాయంత్రం వచ్చినట్లు తేలింది. అయితే.. మళ్లీ వేరే రూట్‌లో బయటకు వెళ్లినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. మథేరన్ పోలీసులు మొత్తం ఐదు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం, మృతురాలి తల కోసం వెతుకులాట సాగిస్తున్నారు. ఇందులో మూడు పోలీసు బృందాలు ముంబై పోలీసులు కాగా, రెండు బృందాలు రాయ్‌గడ్ పోలీసులు కావడం గమనార్హం. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పన్వేల్ సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై మథేరన్ వాసి ఒకరు మాట్లాడుతూ.. మథేరన్‌లో చాలామంది లాడ్జి బిజినెస్‌నే ఆదాయ మార్గంగా ఎంచుకున్నారని, కనీసం ఐడెంటిటీ కార్డు కూడా అడక్కుండా రూమ్స్ ఇస్తుంటారని చెప్పాడు.
ఇది కూడా చదవండి: Shocking: భర్త బయటకు వెళ్లాడని షాపులో కూర్చున్న ఈమెకు పాపం ఎందుకిలా జరిగిందో..
ఇదిలా ఉండగా.. ఈ కేసును ఎట్టకేలకు పోలీసులు త్వరితగతిన ఛేదించారు. పూనమ్ పాల్ భర్తే ఆమెను అతి కిరాతకంగా హత్య చేసినట్లు తేల్చారు. ఆమె భర్త రాంపాల్ ఈ అమానుషానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలింది. పూనమ్‌కు, పన్వేల్‌కు చెందిన రాంపాల్‌కు మేలో వివాహమైంది. ఇద్దరి స్వస్థలం ఉత్తరప్రదేశ్ కావడం గమనార్హం. పూనమ్ ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తుండేది. రాంపాల్‌కు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానం పెను భూతమై ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. అందుకు మథేరన్‌ను ఎంచుకున్నాడు. అప్పటికే రెండుసార్లు ఈ ప్రాంతానికి రాంపాల్ వచ్చి వెళ్లాడు.
డిసెంబర్ 11న భార్యను మథేరన్‌కు తీసుకొచ్చాడు. ఫేక్ పేర్లు చెప్పి రూమ్స్ తీసుకున్నాడు. ఇక్కడి లాడ్జిల కక్కుర్తి గురించి రాంపాల్‌కు ముందే తెలియడంతో ఐడీ కార్డులు చూపించే పనిలేకుండా పోయింది. భార్యను ఆదివారం తెల్లవారుజామున హత్య చేసి మూడు ముక్కలుగా చేశాడు. మూడు ముక్కలుగా చేసిన భార్య శరీర భాగాలను బ్యాగ్‌లో ప్యాక్ చేసి వ్యాలీలో రకరకాల ప్రాంతాల్లో పడేశాడు. ఆ తర్వాత పన్వేల్‌లోని ఇంటికి వెళ్లిపోయాడు. పూనమ్ ఎవరో, ఆమెను చంపిందెవరో తెలియకుండా ఉండేందుకు రాంపాల్ ఎంతో ప్రయత్నించాడు. ఆమె భుజంపై ఉన్న టాటూను చెరిపేందుకు ప్రయత్నించాడు. కుదరకపోవడంతో ఆమె చేతిని నరికేశాడు. పోలీసులు రాంపాల్‌ను అరెస్ట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Husband, Mumbai, Wife murdered