ఇంటి దొంగలను ఈశ్వరుడైన కనిపెట్టలేడనే పాత సామెతలను ఆ పూజారీ చాలా ప్రగాఢంగా నమ్మినట్టున్నాడు.. కాని ఆధునిక కాలంలో ఈశ్వరుడి మూడో నేత్రంగా ఎక్కడ చూసినా కెమెరాలు తెరుచుకుని ఉన్నాయనే సంగతిని మరచి ఏకంగా తాను పూజలు చేస్తున్న గుడిలోనే హుండిలో డబ్బులు తీశాడు.. దీంతో ఆ విషయం కాస్తా కెమెరాల ద్వారా బయటిపొక్కడంతో సంజాయిషీ నోటిసులు అందుకున్నాడు ఆ పూజారీ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కేశవాపురం జగన్నాధపురం గ్రామంలో ఉన్న శ్రీ కనకదుర్గ దేవస్థానము ( పెద్దమ్మగుడి ) లో ఓ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది , జనవరి 29 న మధ్యాహ్నాం ఆలయంలో సిబ్బంది ఎవరు లేని సమయంలో హుండీ నుండి పురాణం శేషు శాస్త్రి అనే పూజారీ డబ్బులు దొంగిలించినట్టుగా కెమెరాలో రికార్డు అయింది. ఈ విషయం పై దేవస్థాన ధర్మకర్తలమండలి అధ్యక్షుడు గుడి ఈవోకు ఫిర్యాదు చేశాడు. దీంతో ధరఖాస్తును స్వీకరించిన ఆలయ ఈవో గుడిలో ఉన్న సీసీ కెమెరాలను పరీశీలించారు. దీంతో శేషు శాస్త్రి మధ్యాహ్నం సమయంలో ఎవరు లేనిది చూసి హుండిలో డబ్బులు తీస్తున్నట్టుగా గుర్తించారు. ఈ క్రమంలోనే సంబంధిత పూజారీకి ఈవో నోటిసులు జారీ చేశారు. జరిగిన సంఘటనపై సంజాయిషి చెప్పాలని తెలిపారు. దీంతో పాటు ఆ సమయంలో ఆలయంలో ఉండాల్సిన ఇతర సిబ్బంది సైతం లేకపోవడంతో వారిపై సైతం చర్యలు తీసుకునేందుకు ఆలయ అధికారులు సంజాయిషి నోటిసు పంపారు. కాగా శేషు శాస్త్రి గతం లో కూడా రెండుసార్లు దొంగతనం చేసి 6 నెలలు పాటు సస్పెండ్ అయినట్టు తెలుస్తోంది. దీంతో ఆ పూజారీపై సంస్థపరమైన చర్యలతోపాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని స్థానిక భక్తులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Theft