Home /News /crime /

Telangana: తోడికోడళ్ల మధ్య గొడవ.. అడ్డొచ్చిన వ్యక్తి ప్రాణం బలి.. అసలేం జరిగింది..

Telangana: తోడికోడళ్ల మధ్య గొడవ.. అడ్డొచ్చిన వ్యక్తి ప్రాణం బలి.. అసలేం జరిగింది..

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

Telangana: అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్న ఇద్దరు తోడికోడళ్ల మధ్య ఓ మొబైల్ వివాదం చలికిచిలికి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఇద్దరి మధ్య గొడవ రెండు కుటుంబాల మధ్యగా మారింది. ఈ గొడవలో ఓ నిండు ప్రాణం బలైంది. వివరాలు ఇలా ఉన్నాయి.

  (జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా, న్యూస్‌18 తెలుగు)

  పచ్చటి కాపురంలో సెల్‌ఫోన్‌ చిచ్చురేగింది. ఓ వ్యక్తి నిండు ప్రాణాలు తీసింది. కనిపించకుండాపోయిన తన సెల్‌ఫోన్‌ నువ్వే తీశావంటూ తోడికోడళ్లు నిందలు వేసుకున్నారు. అప్పటిదాకా కలిసిమెలిసి ఉన్న అన్నదమ్ములు, అటు ఇటూ ఉన్న బంధువులు బద్ద విరోధులుగా మారిపోయారు. పంచాయతీలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఒకరికి తలపై గట్టిగా దెబ్బ తగిలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. కారణం చిన్నదే అయినా, సహనం.. ఓర్పు స్థానంలో అసూయ, ధ్వేషాలు నిండడంతో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం ఆచార్లగూడేనికి చెందిన కొలికపొంగు రవికిరణ్‌, రవితేజలు అన్నదమ్ములు. కొద్ది రోజుల క్రితం రవికిరణ్‌ భార్య స్వర్ణకుమారి సెల్‌ఫోన్‌ పోయింది. అయితే తన సెల్‌ఫోన్‌ను తోడికోడలు శ్రీలత తీసిందన్న అనుమానంతో స్వర్ణకుమారి గొడవకు దిగింది. ఇది చినికిచినికి గాలివానగా మారింది. నిత్యం ఇంట్లో ప్రశాంతంగా లేకుండా నిద్రలేచిన దగ్గరి నుంచి సెల్‌ఫోన్‌ వివాదమే నడుస్తోంది.

  ఇలా వివాదం రోజురోజుకూ పెరిగిపోతుండడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇలా ఊర్లో ఉన్న పెద్దమనుషులు గత పదిరోజుల సమయంలో అనేకమార్లు ఇరువురితో మాట్లాడుతూ వివాద పరిష్కారానికి ప్రయత్నించారు. ఎవరు ఎన్ని సార్లు చెప్పినా.. తన సెల్‌ఫోన్‌ దొంగతనం చేసింది తోడికోడలు శ్రీలతేనని స్వర్ణకుమారి పదేపదే ఆరోపణలు చేసింది. దీంతో అదే గ్రామంలో ఉండే శ్రీలత తండ్రి జిల్లేపల్లి వెంకన్న అలియాస్‌ కోళ్ల గోవింద్‌ కలుగజేసుకున్నాడు. తన కుమార్తె సెల్‌ఫోన్‌ దొంగతనం చేయలేదని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో స్వర్ణకుమారి తరఫున మాట్లాడడానికి ఆమె పుట్టింటి వాళ్లు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కె.రామచంద్రాపురం నుంచి ఆచర్ల గూడేం కు చేరుకున్నారు. ఇరువురి తోడికోడళ్ల తరపున బంధువర్గం రావడంతో వాదనలు పెరిగిపోయాయి. అసలు విషయం పక్కదారి పట్టి పాతవిషయాలు తవ్వుకోవడంతో గొడవ పెరిగి పెద్దదైంది.

  ఈ క్రమంలో ముమ్మాటికీ తన కుమార్తె సెల్‌ఫోన్‌ దొంగతనం చేయలేదంటూ గట్టిగా వాదిస్తున్న శ్రీలత తండ్రి కోళ్ల గోవిందును స్వర్ణకుమారి తరపు బంధువులు గట్టిగా నెట్టారు. దీంతో గోవిందు సీసీ రోడ్డుపై పడిపోయాడు. సీసీ రోడ్డు అంచు బలంగా తలకు తగలడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. చిన్నచిన్న విషయాలకు ఉద్రేకాలకు లోనైన ఫలితం ఓ వ్యక్తి నిండు ప్రాణాలను బలితీసుకుంది. దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది.
  Published by:Veera Babu
  First published:

  Tags: Cell phone, Crime, Crime news, Khammam, Mobile missing, Telangana crime news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు