పుదుచ్చేరి: ఈ యువకుడికి వివాహమై నాలుగు నెలలయింది. ఏసీ మెకానిక్‌గా పనిచేస్తూ ఉన్నంతలో భార్యను, అమ్మానాన్నను చూసుకుంటూ సంతోషంగా ఉన్నాడు. కానీ.. ఒక్క పరిణామం ఇతని జీవితాన్ని తలకిందులు చేసింది. మంచి చెప్పబోతే చెడు ఎదురైంది. తాగి రోడ్డుపై నానా హంగామా చేస్తున్న వారిని వారించబోతే చివరకు వారి చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. పుదుచ్చేరిలోని విలియనూరులో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీష్ అలియాస్ మణికందన్ (28) పుదుచ్చేరిలోని విలియనూరులో ఉంటూ ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం మతివతన(25) అనే యువతితో వివాహమైంది.
ఇది కూడా చదవండి: Wife Crying: అయ్యో పాపం.. భర్తకు దూరంగా ఉన్నాననుకుంది గానీ ఇలా జరిగేసరికి..
కొత్త జంట ఎంతో సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. కానీ.. ఇంతలోనే ఓ ఘటన వారి జీవితాల్లో విషాదం నింపింది. వీళ్ల ఇంటికి దగ్గర్లో నివాసం ఉండే శంకర్(35), అతని భార్య రమణి(28) గత రాత్రి ఇంటి ముందు రోడ్డుపై వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ పార్టీలో రమణి తమ్ముడు రాజా(26), అతని స్నేహితులు అజ్హర్(23), తమిళ్‌సెల్వన్ (23) కూడా పాల్గొన్నారు. అందరూ కలిసి మద్యం సేవించి నడిరోడ్డుపై నానా రచ్చ చేశారు. మత్తు బాగా తలకెక్కడంతో నోటికొచ్చిన బూతులు తిడుతూ, ఒకరినొకరు తిట్టుకుంటూ రోడ్డుపై వచ్చేపోయే వారికి, ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది కలిగించారు.
పరిస్థితి శృతి మించడంతో ఇది మంచి పద్ధతి కాదని.. ఏదైనా ఉంటే ఇంట్లోకి వెళ్లి పార్టీ చేసుకోవాలని సతీష్, అతని స్నేహితులు శంకర్‌కు సూచించారు. ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ ముదరడంతో స్థానికులు జోక్యం చేసుకుని గొడవ పెద్దది కాక ముందే ఎటువాళ్లను అటు పంపించేశారు. ఆ తర్వాత కొంతసేపటికి సతీష్ ఫోన్ మాట్లాడుతూ ఇంటి బయటకు వచ్చాడు. రోడ్డుపై సతీష్‌ను ఒంటరిగా చూసిన అజ్హర్, తమిళ్‌సెల్వన్, రాజా, శంకర్ అతనిని కొట్టి కత్తులతో పొడిచి అక్కడి నుంచి పారిపోయారు.
సతీష్ భార్య, ఇంట్లో వాళ్లు అతని కేకలు విని బయటకు వచ్చి చూడగా సతీష్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయి పడి ఉన్నాడు. హుటాహుటిన అతనిని పుదుచ్చేరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గొంతు కోయడం, కడుపులో పొడవడంతో ఎంతో రక్తం కోల్పోవడం.. తీవ్రమైన గాయాలు కావడంతో సతీష్ ఐసీయూలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. విలియనూరు ఇన్‌స్పెక్టర్ కృష్ణన్ స్పాట్‌కు వెళ్లి విచారణ చేశారు. సతీష్ హత్యకు కారణమైన ఐదుగురిపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం వీరికి జీవిత ఖైదు విధించింది. నిందితులు ప్రస్తుతం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కొత్తగా పెళ్లి చేసుకుని సంతోషంగా గడుపుతున్న సమయంలో భర్తను ఇలాంటి పరిస్థితుల్లో కోల్పోయిన మతివతన కన్నీరుమున్నీరయింది. ఇక తనకు దిక్కెవరంటూ రోదించింది. ఆమెను ఓదార్చడం అక్కడున్న వారి తరం కాలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.