దేశంలో ఏదో ఒక మూల ప్రతి రోజూ స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. హత్యలు, మానభంగాలు గురించిన వార్తలను మనం చదువుతూనే ఉన్నాం. ఎన్ని చట్టాలు తెచ్చినా మృగాళ్లు మారడం లేదు. చట్టంలోని లొసుగులను వాడుకుంటూ మానవమృగాలు స్త్రీలపై దాడులు చేస్తూనే ఉన్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం స్త్రీలు అప్రమత్తతతో వ్యవహరించి దాడుల నుంచి తప్పించుకుంటున్నారు. మృగాళ్లకు ఎదురుతిరుగుతున్నారు. అలాంటి సంఘటనే ఇటీవల ఒకటి జరిగింది. బంధువుల ఇంటికి వెళ్తే ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఆమె వెంటనే తేరుకుని ప్రతిదాడి చేసి తనను తాను రక్షించుకుంది. ఫలితంగా 19 ఏళ్ల ఆ యువతి చేతిలో ఓ వ్యక్తి హతమయ్యాడు. తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లాలోని షోలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తిరువళ్లూర్ కు చెందిన ఓ 19 ఏళ్ల యువతి షోలవరంలోని తన బంధువుల ఇంటికి వచ్చింది. కొద్ది రోజులుగా ఆమెను అజిత్ అలియాస్ కిల్లీ అజిత్ చాటుగా గమనించసాగాడు. శనివారం సాయంత్రం ఆమె తన బంధువుల ఇంటి పక్కన ఉన్న గుర్రాల కొట్టంలోకి మూత్ర విసర్జనకు వెళ్లింది. అదే అదనుగా అజిత్ ఆమె వెనుకే వెళ్లాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఆమె అవరకుండా కత్తి చూపించి బెదిరించాడు. దీంతో ఏం చేయాలో ఆ యువతికి పాలు పోలేదు. అతడు కాస్త నిర్లక్ష్యంగా ఉన్న సమయాన్నే ఆమె తనకు అనుకూలంగా మార్చుకుంది. అతడిని వెనక్కు నెట్టేసింది. దీంతో అతడు కింద పడిపోయాడు. అజిత్ కింద పడిపోగానే అతడి చేతిలోని కత్తి కూడా పక్కకు పడిపోయింది. ఆ కత్తిని చేజిక్కించుకున్న యువతి.. అస్సలు ఆలస్యం చేయలేదు. అతడిపై కూర్చుని కత్తితో పొడవసాగింది. ముఖంపై, మెడపై కత్తితో పలుమార్లు పొడిచింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ తర్వాత వెంటనే ఆమె తన బంధువులకు సమాచారం ఇచ్చింది. దీంతో వాళ్లు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.
’మేం కేసును రిజిస్టర్ చేసుకున్నాం. తనను తాను రక్షించుకునేందుకే ఈ దాడిని చేశానని ఆ యువతి చెబుతోంది. ప్రాథమికంగా దీనికి ఆధారాలు కూడా సంఘటన స్థలంలో లభించాయి. ఆ యువతి చెప్పిన స్టేట్ మెంట్ ను రికార్డు చేసుకున్నాం. అదే విధంగా ఈ ఘటనను ఎవరైనా ప్రత్యక్షంగా చూశారా..? అన్నది విచారిస్తాం. ఈ కేసులో విచారణను త్వరగా పూర్తి చేస్తాం‘ అని షోలవరం పోలీస్ ఇన్ స్పెక్టర్ నాగలింగం తెలిపారు. ఓ 19 ఏళ్ల యువతి ఒక వ్యక్తిని కత్తితో చంపిందన్న విషయం.. స్థానికంగా కలకలం రేపుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Rape and murder, Rape attempt, Tamil nadu, Tamil nadu Politics