పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువతిని యువకుడు రైలు కిందకు తోసిన ఘటన ముంబైలో వెలుగుచూసింది. అదృష్టవశాత్తూ ఆ యువతి గాయాలతో బయటపడింది. ముంబైలోని వడాలా ప్రాంతానికి చెందిన సుమేధ్ జాదవ్ ఖర్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని వెంటపడుతూ...
ముంబై: పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువతిని యువకుడు రైలు కిందకు తోసిన ఘటన ముంబైలో వెలుగుచూసింది. అదృష్టవశాత్తూ ఆ యువతి గాయాలతో బయటపడింది. ముంబైలోని వడాలా ప్రాంతానికి చెందిన సుమేధ్ జాదవ్ ఖర్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని వెంటపడుతూ ఇబ్బందిపెడుతున్నాడు. ఆ యువతి ఇష్టం లేదని చెప్పినా వినకుండా వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే అంథేరి నుంచి ఖర్ వెళ్లేందుకు ఆ యవతి లోకల్ ట్రైన్ ఎక్కింది. ఆమెను వెంబడించిన సదరు యువకుడు కూడా ఆ ట్రైన్లో ఎక్కాడు. దీంతో.. ఆమె భయంతో తన తల్లిని ఖర్ రైల్వేస్టేషన్‌కు రావాల్సిందిగా కోరింది. ఆ యువకుడు ఇబ్బంది పెడుతున్నాడని ఫోన్లో చెప్పింది.
కూతురు మాటలకు కంగారుపడిన తల్లి ఖర్ రైల్వేస్టేషన్‌కు వెళ్లింది. అయితే.. ఆ యువతి తల్లిని చూసినప్పటికీ సుమేధ్ వెంటపడి వేధించడం మానలేదు. రైలు దిగి వెళుతున్న ఆమెను ఇబ్బందిపెట్టాడు. తనను పెళ్లిచేసుకోవాలని బలవంతం చేశాడు. అందుకు ఆమె ససేమిరా అనడంతో సైకోలా ప్రవర్తిస్తూ ఆమెను వెళుతున్న రైలు కిందకు తోసే ప్రయత్నం చేశాడు. అయితే.. అదృష్టవశాత్తూ చుట్టుపక్కల జనం అలర్ట్‌గా ఉండటంతో ఆ యువతి రైలు కింద పడకుండా కాపాడగలిగారు. కిందపడిన ఆమె తల ప్లాట్‌ఫాంకు గట్టిగా తగలడంతో తలకు తీవ్ర గాయమైంది.
ఆమె ప్రాణాలకు ముప్పేమీ లేదని, తలకు 12 కుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసుల విచారణలో యువతీయువకుడికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుమేధ్, ఆ యువతీ ఇద్దరూ రెండేళ్ల క్రితం ఒకే దగ్గర పనిచేసేవారు. ఆ సమయంలోనే ఇద్దరికీ మధ్య స్నేహం కుదిరింది. అయితే.. ఆ యువకుడు మద్యానికి బానిసైన విషయం తెలుసుకున్న ఆ యువతి అప్పటి నుంచి అతనికి దూరంగా ఉంటోంది.
సుమేధ్ మాత్రం తనతో మాట్లాడాలని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఈ విషయంలో సుమేధ్ తనను వేధిస్తున్నాడని గతంలోనే బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పరారయిన సుమేధ్ను మరో 12 గంటల్లోపు అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రైల్వే స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. బాధితురాలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఖర్‌లోని ఆమె ఇంటికి వెళ్లింది.