దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో మరో ట్విస్ట్. ఇప్పటికే ఆ కేసును సీబీఐ విచారిస్తుండగా.. తాజాగా ఒక వ్యక్తి ఢిల్లీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. తన భార్య ఫోటోలను హత్రాస్ బాధితురాలు ఫోటోలుగా వాడుతున్నారంటూ ఆయన ఆరోపిస్తున్నాడు. దీంతో హత్రాస్ గ్యాంగ్ రేప్ జరిగినప్పట్నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న బాధితురాలు ఫోటోలు నిజం కాదని అర్థమవుతున్నది. కాగా, ఈ పిటిషన్ ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వంతో పాటు.. సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ కు షాకిచ్చింది.
పిటిషన్ దారుడి ఫిర్యాదు నిజమో కాదోననేదానిపై విచారణ జరిపించాలని జస్టిస్ నవీన్ చావ్లా తెలిపారు. ఆయన ఫిటిషన్ పై విచారణ ప్రారంభించిన నేపథ్యంలో.. పిటిషన్ దారుడు స్పందిస్తూ.. తన భార్య చనిపోయిందని.. ఆమె ఫోటోలను హత్రాస్ బాధితురాలి ఫోటోలుగా వాడుతున్నారని ఆరోపించాడు. సోషల్ మీడియా సర్కిల్స్ లో ఆ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయని ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.
దీనిపై జస్టిస్ నవిన్ చావ్లా స్పందిస్తూ.. ఫిర్యాదుదారుడి ఫిర్యాదు నిజమే అయితే కేంద్ర ప్రభుత్వం.. గూగుల్, ఫేస్బుక్ లకు కఠినమైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ఇదే విషయమై కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ స్పందన తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఫేస్బుక్, గూగుల్ కూడా దీనిపై స్పందించాలని ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రోజుల్లో స్పందన తెలియజేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇదే సమయంలో ఫిర్యాదుదారుడు కూడా అతడు ఆరోపిస్తున్నట్టుగా.. సంబంధిత పత్రాలను ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే నెల 9న జరగనుంది.
కాగా, గతనెల 14న ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో దళిత యువతి పై నలుగురు ఉన్నత వర్గాలకు చెందిన నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేయడమే గాక.. అత్యంత పాశవికంగా ఆమె నాలుకను కోశారు. ఈ ఘటనలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ.. కొద్ది రోజుల క్రితమే ఆమె చనిపోయిన విషయం విదితమే. ఈ కేసు యూపీలోనే గాక దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సీబీఐ ఈ కేసును విచారిస్తుండగా.. విచారణను యూపీ నుంచి తరలించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తున్న విషయం విదితమే.