Home /News /crime /

A GANG FROM HYDERABAD IS SELLING RENTAL CARS IN OTHER STATES FULL DETAILS HERE MS

అద్దెకార్లను అమ్మేసి.. ఖాకీల రూపంలో తిరిగి స్వాధీనం.. ఇదో కొత్త రకం దందా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మీ దగ్గర కారు అద్దెకు తీసుకుంటారు. మీకు అనుమానం రాకుండా.. నమ్మకం కలిగేలా కొన్ని రోజులు మీకు అక్కడే తిరుగుతారు. ఆ పై కారును మీకు తెలియకుండానే అమ్మేస్తారు. మళ్లీ నెలకో.. రెండు నెలలకో దానిని తీసుకొచ్చేస్తారు.. ఇదో కొత్తరకం మోసం..

 • News18
 • Last Updated :
  మోసపోయేవాడు ఉన్నన్ని రోజులు మనుషులు మోసం చేస్తూనే ఉంటారు. మోసగాళ్లకు వచ్చినన్ని ఆలోచనలు మరెవరికి రావేమో. వారి తెలివితేటలకు, ఆలోచనా విధానానికి, వాడుతున్న సాంకేతికతకు పోలీసులకే కండ్లు బైర్లు కమ్ముతున్నాయి. లేకుంటే...! ఒక కారును యజమానుల దగ్గర తీసుకుని.. కొద్దిరోజులు వాటిని నడిపి.. యజమానులకు తెలియకుండా దానిని అమ్మేసి.. అమ్మిన వారి దగ్గర్నుంచే కారును మళ్లీ స్వాధీనం చేసుకోవడమంటే మాటలా..? ఇదేదో సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా స్క్రిప్ట్ అనుకుంటున్నారా..? అస్సలు కాదు.. మన హైదరాబాద్ లో మోసగాళ్లు సృష్టిస్తున్న అద్భుతాలు. చదవండి..

  మీకు కారు ఉందా..? వర్క్ ఫ్రమ్ హోమ్, ఇతరత్రా కారణాల వల్ల కారును ఇంట్లోనే ఉంచుతున్నారా..? ఇంట్లో ఉంచడం ఎందుకు.. ఏదైనా కార్ల కంపెనీకి అద్దెకిస్తే ఈఎంఐ డబ్బులైనా మిగుల్తాయని అనుకుంటున్నారా..? అయితే వెంటనే ఆ ఆలోచనను సమాధి చేసేయండి. కారు ఇంట్లో షెడ్ లో మూలకు పడి ఉన్నా పర్లేదు. కానీ దానిని మాత్రం అద్దెకు అస్సలుకే ఇవ్వొద్దు. కిరాయికి తీసుకున్న కార్లను యజమానికి తెలియకుండానే వేరే వాళ్లకు అమ్మే ముఠా ఒకటి నగరంలో హల్ చల్ చేస్తుంది. అమ్మిన కార్లను తీసుకొచ్చి ఇస్తున్నారనుకోండి. అదేంటి..? అదే అసలు ట్విస్ట్.

  నగరానికి చెందిన ఒక ముఠా.. కార్లను అద్దెకు తీసుకుంటుంది. సదరు యజమానికి అనుమానం రాకుండా ఉండేందుకు ఆ యజమాని ఉండే ప్రాంతంలో కొద్దిరోజుల పాటు అటూ ఇటూ కారును తిప్పుతుంది. ఆపై కన్పించకుండా పోతుంది. నెలో, రెండు నెలల తర్వాతో మళ్లీ కారును తీసుకొచ్చి ఇస్తుంది. ఇక్కడేమీ మోసం లేదనుకుంటున్నారా..? అక్కడే మీరు తప్పులో కాలేశారు. ఆ ముఠా మీ కారును వేరే రాష్ట్రంలో అమ్మేస్తుంది. కారును దొంగిలించి తీసుకొచ్చామంటూ ఆ కారును తక్కువ ధరకు విక్రయిస్తుంది. కారు మోడల్ ను బట్టి రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల దాకా వసూలు చేస్తున్నారు.  కారు కు నకిలీ పత్రాలు తయారు చేసే గ్యాంగ్ కూడా ఉంది. అదే అన్నీ వ్యవహారాలు చూసుకుంటుంది.

  వారం పది రోజుల తర్వాత తిరిగి కారును విక్రయించిన చోటకు మరో గ్యాంగ్ వెళ్తుంది. ఈ సారి వెళ్లింది మాములు గ్యాంగ్ కాదండోయ్.. పోలీసు గ్యాంగ్. సదరు కారు యజమాని తమకు కంప్లయింట్ ఇచ్చాడని.. ఆ కారును ఇవ్వకుంటే బొక్కలోకి తోస్తామని చెప్పడంతో కారును కొన్న వ్యక్తి చచ్చుకుంటూ దానిని అప్పగిస్తాడు. అంతే.. అదే కారును తిరిగి ఎవరిదగ్గరైతే అద్దెకు తీసుకున్నారో.. అక్కడే ఇచ్చేస్తారు. మోసగాళ్లు ఈ కార్లకు జీపీఎస్ ను కూడా ఏర్పాటుచేశారండోయ్.. కారు ఎక్కడికెళ్తుంది..? ఎక్కడుంది..? అన్ని వివరాలు వారికి అందుబాటులో ఉంటాయి. అదీ సంగతి.

  కొద్దిరోజులుగా నగరంలో కార్లను అద్దెకు ఇచ్చిన వారి కార్లు కనిపించడం లేదని కలకలం రేగడంతో పోలీసులు దీనిమీద దృష్టి సారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మోసంలో ఎవరెవరున్నారని ఇంకా తెలియరాలేదు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Cars

  తదుపరి వార్తలు