ఈ రాయి వాడితే దరిద్రం దరిదాపుల్లోకి రాదట.. ఖమ్మం ఏజెన్సీలో అందినకాడికి దండుకుంటున్న ముఠా

గతంలో రంగురాళ్ల పేరిట మోసాలను విన్నాం.. చూశాం.. కానీ ఇప్పుడు తాజాగా ‘సులేమాన్ రాయి’ అంటూ దానికి ఉన్న పవర్‌ను ప్రచారం చేస్తూ.. జనాన్ని వెర్రెత్తిస్తున్న ముఠాలు ఇప్పుడు ఏజెన్సీలో చెలరేగిపోతున్నాయి.

news18
Updated: November 23, 2020, 4:43 PM IST
ఈ రాయి వాడితే దరిద్రం దరిదాపుల్లోకి రాదట.. ఖమ్మం ఏజెన్సీలో అందినకాడికి దండుకుంటున్న ముఠా
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 23, 2020, 4:43 PM IST
  • Share this:
కాదేదీ మోసానికి అనర్హం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. గుడ్డిగా నమ్మేవాడున్నంతకాలం మోసం చేసేవాళ్లు చెలరేగిపోతూనే ఉంటారన్న దానికి ఇప్పుడు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వెలుగులోకి వస్తున్న మోసాలు తార్కాణం. గతంలో రంగురాళ్ల పేరిట మోసాలను విన్నాం.. చూశాం.. కానీ ఇప్పుడు తాజాగా ‘సులేమాన్ రాయి’ అంటూ దానికి ఉన్న పవర్‌ను ప్రచారం చేస్తూ.. జనాన్ని వెర్రెత్తిస్తున్న ముఠాలు ఇప్పుడు ఏజెన్సీలో చెలరేగిపోతున్నాయి. నమ్మినవారి నుంచి అందినంత దండుకుంటూ తమ దందాను కొనసాగిస్తున్నాయి. భద్రాచలం, పాల్వంచ, మణుగూరు, కొత్తగూడెం, సత్తుపల్లి ప్రాంతాలలో ఈ సులేమాన్‌ రాయి పేరిట మోసాలు ఒక్కొక్కటీ వెలుగుచూస్తున్నాయి. మనిషి బలహీనతను క్యాష్‌ చేసుకోడానికి తయారైన ఈ ముఠాలు పగలు, రాత్రి అన్న తేడా లేకుండా ఇళ్ల దగ్గరకు వెళ్లి మరీ మోసాలకు పాల్పడుతున్నాయి. ఇలా మోసపోయిన వారు మాత్రం నలుగురిలో పల్చనవుతామన్న బెరుకుతో నోరు విప్పకపోవడం ఈ ముఠాలకు కలసివస్తోంది.

ఇలా చెబుతుంటారు.. మీ ఇంట్లో సమస్య ఉందా.. ఆరోగ్యం బాగాలేదా..? పిల్లలకు చదువు రావడం లేదా..? చిన్నోడు అల్లరి చేస్తున్నాడా..? పెద్దోడు మాట వినడం లేదా...? అమ్మాయికి పెళ్లి కావడం లేదా? అబ్బాయికి ఉద్యోగం రావడం లేదా...? వ్యాపారం కలసి రావడం లేదా? ఇలా ప్రతి మనిషికి ఉండే కుటుంబ సంబంధ సమస్యలన్నిటికీ దోషాలే కారణమని.. దానికీ నరఘోషే అసలు రోగమని వీళ్లు తేల్చేస్తారు. దీనికి మందు తమ వద్ద ఉందంటూ నమ్మిస్తారు. చిటికెలో బాధలు, వ్యాధులు మాయమంటూ నమ్మకం కోసం కొన్ని ప్రక్రియలు చేస్తుంటారు. వీటిని నమ్మినవారి నుంచి అందినకాడికి దండుకుంటూ క్రిస్టల్‌ రాళ్లు చేతిలో పెట్టి ఉడాయించడం.. ఆనక ఏ ఫలితం రాలేదంటూ బాధితులు లబోదిబోమంటూ మొత్తుకోవడం కామన్‌గా మారింది.

ఇలా చేస్తుంటారు.. 'ఈవిల్‌ ఐ స్టోన్‌'గా చెప్పే ఈ రాయిలో అనేక మహిమలున్నాయని.. ఈ రాయిని ఉంగరంలోనో.. లాకెట్‌గానో లేదంటే దండలోనో ధరిస్తే సమస్యలు దరిచేరవని, ఉన్నవి తొలగిపోతాయని నమ్మిస్తుంటారు. సులేమాన్‌ స్టోన్‌ అంటూ కొందరు వస్తుంటారు నమ్మి మోసపోవద్దంటూ వాళ్లే చెబుతూ.. ఒరిజినల్‌ తమ వద్ద మాత్రమే ఉందంటూ.. దానికి రకరకాల పరీక్షలు చేస్తుంటారు. సులేమాన్‌ రాయిని గుప్పిట్లో పెట్టుకుని ఎంతటి పదునైన బ్లేడ్‌ను తీసుకుని కట్‌ చేసినా ఏమీ కాదని.. కత్తితో కోసినా తెగదని.. సూదితో గుచ్చినా దిగదని.. ఇంకా గాజు గ్లాసులో నీళ్లు పోసి ఈ రాయిని వేయగానే కాసేపటికి గులాబి రంగులోకి వచ్చేలా చేస్తుంటారు. ఇలా చిన్న చిన్న గిమ్మిక్కులు చేస్తూ జనాన్ని నమ్మిస్తుంటారు.

దీంతో నిజంగానే మహిమలున్నాయేమోనన్న నమ్మకంతో చెప్పిన రేటుకు కొనుగోలు చేస్తూ మోసపోవడం జనం వంతవుతోంది. సాధారణంగా రంగురాళ్లను పాలిష్‌ చేసి రకరకాలుగా ఫ్యాషన్లుగా ధరించడం మామూలే. నిజానికి వీటికి మహిమలు ఉండే ఆస్కారం లేదు. వజ్రం మొదలు కొని ఏ రాయికైనా మహిమలుండే అవకాశం లేదని, అరుదుగా లభించే రాళ్లు కనుక, దాన్ని బట్టే విలువ ఉంటుందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. సులేమాన్‌ రాళ్ల పేరిట అర్థరాత్రిళ్లు తిరుగుతున్న ఓ ముఠాను కొత్తగూడెం పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపారు.
Published by: Srinivas Munigala
First published: November 23, 2020, 4:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading