మైసూరు: ఆ యువతీయువకుడి సామాజిక వర్గాలు వేరు. మనసులు కలవడంతో మనువాడాలనుకున్నారు. అయితే.. ఆ యువతి తండ్రి పెళ్లికి ససేమిరా అన్నాడు. దీంతో.. పెద్దలను కాదనుకుని వాళ్లిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
కానీ.. ఆ పెళ్లికి సంబంధించి మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవడానికి ఆ కొత్త జంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లిన సందర్భంలో యువతి తండ్రి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో.. కొద్దిసేపు అక్కడ హైడ్రామా చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హరాళే గ్రామానికి చెందిన మహేంద్ర అనే యువకుడు, చిత్ర అనే యువతి కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు.
ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావించారు. ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోలేదు. చిత్ర తండ్రి బసవరాజ్ కూతురి ప్రేమను అంగీకరించలేదు. అతనిని మర్చిపోవాలని కూతురిని హెచ్చరించాడు. కానీ.. ఆమె ప్రేమించిన వ్యక్తి కోసం ఇల్లు విడిచి అతనితో వెళ్లిపోయింది. ఇద్దరూ డిసెంబర్ 8న ఇరు కుటుంబాల నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో జరిగింది.
మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం వీరిద్దరూ ఇటీవల ఒకరోజు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వచ్చారు. కూతురు ఇలా ప్రేమ పెళ్లి చేసుకుందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆమె తండ్రి బసవరాజ్ వాళ్లిద్దరూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వచ్చారన్న సంగతి తెలిసి అక్కడికి వెళ్లాడు. ఈ సమయంలో కూతురిని చూసిన బసవరాజ్ నానా హంగామా సృష్టించాడు. ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ తన వెంట తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.
అయితే.. అక్కడున్న వారు అతని వైఖరిని తప్పుబట్టి ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలని, ఇలా దౌర్జన్యం చేయడం సరికాదని అతనిని వారించారు. తండ్రి ప్రవర్తనతో నివ్వెరపోయిన చిత్ర తన భర్తతో కలిసి ఎలాగోలా అక్కడ నుంచి బయటపడి వెళ్లిపోయింది. అంతేకాదు.. ఈ ఘటన జరిగాక తన తండ్రి నుంచి ప్రాణ హాని ఉందని చిత్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో నంజన్‌గుడ్ పోలీసులు బసవరాజ్ నాయక్‌కు సమన్లు జారీ చేశారు. వాళ్లిద్దరూ మేజర్లని, మరోసారి వారిని ఇబ్బంది పెట్టినట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బసవరాజ్‌ను పోలీసులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో బసవరాజ్ కూతురిని తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.