బెంగళూరు: కర్ణాటకలోని హసన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తలనొప్పి తగ్గించే వైద్యం పేరుతో ఓ ఆలయ పూజారి 37 ఏళ్ల మహిళను చెరకు గడతో కొట్టడంతో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన పార్వతి అనే మహిళ గత రెండు నెలలుగా తలనొప్పి సమస్యతో బాధపడుతోంది. నగరంలోని పలు హాస్పిటల్స్‌లో చూపించుకున్నా ఆమె తలనొప్పికి కారణమేంటో వైద్యులకే అంతుపట్టలేదు.
ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదని వైద్యులు చెప్పారు. ఏ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నా పార్వతికి ఇదే సమాధానం ఎదురైంది. దీంతో.. ఆమెకు తన తలనొప్పి సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. చివరకు.. ఇది డాక్టర్లకు అంతుబట్టే విషయం కాదని, గాలి సోకడం వల్లే ఇలా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నావని ఆమెకు తెలిసిన వాళ్లలో ఒకరు చెప్పారు. దీంతో.. పార్వతికి ఎక్కడ లేని భయం పట్టుకుంది. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఆమెకు హసన్ జిల్లా చెన్నరాయపట్న సమీపంలో ఉన్న బెక్కా గ్రామంలోని Piriyapattaladamma ఆలయ పూజారి మనూ గురించి చెప్పారు. అతను ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి నయం చేస్తాడని పార్వతికి చెప్పడంతో ఆమె అతనిని సంప్రదించింది.
ఆమెకు నయం చేస్తానని చెప్పి.. చికిత్సలో భాగంగా చెరకు గడతో కొట్టాల్సి వస్తుందని.. తట్టుకుంటే తలనొప్పి తగ్గిపోతుందని పార్వతికి ఆలయ పూజారి మనూ చెప్పాడు. ఆమె అంగీకరించడంతో చెరక గడతో ఆమె శరీరంపై, చేతులుకాళ్లు, తలపై కొట్టాడు. కొన్ని దెబ్బలు కొట్టగానే ఆమె కొంతసేపటికి స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను హుటాహుటిన హసన్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించగా డిసెంబర్ 8న ఆమె చనిపోయినట్లు తెలిసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన జరిగినప్పటి నుంచి పూజారి మనూ కనిపించకుండాపోయాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. పార్వతి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో ఆమె చనిపోవడానికి కారణంపై పూర్తి స్థాయి స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. మనూపై పోలీసులు సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇలా అన్యాయంగా పార్వతి ప్రాణాలు కోల్పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆమెకు పెళ్లై, పిల్లలు కూడా ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangalore, Crime news, Karnataka, Married women