Covid Test: ఈ 32 ఏళ్ల కుర్రాడికి ఎందుకిలా.. రెండుసార్లు కరోనా నెగిటివ్.. రెండు రోజుల్లో పెళ్లనగా..

పృథ్వీరాజ్ (ఫైల్ ఫొటో)

చిక్‌మగళూరు జిల్లా కొప్ప తాలూకాలోని దేవరకొడిగె గ్రామానికి చెందిన మంజునాథ్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన కొడుకు పృథ్వీరాజ్ బెంగళూరు నగరంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. కర్ణాటక ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో సొంతూరికి వెళ్లాడు. పృథ్వీకి అప్పటికే పెద్దలు పెళ్లి నిశ్చయించారు.

 • Share this:
  చిక్‌మగళూరు: దేశంలో కరోనా మహమ్మారి చాలా కుటుంబాలకు అపకారం చేసింది. రోజుకు వేల మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్ విజృంభణ కారణంగా పెళ్లిళ్ల సీజన్‌లో ముహూర్తాలు ముందుకెళ్లమంటున్నప్పటికీ వధూవరుల కుటుంబాలు మాత్రం వెనకడుగేస్తున్న పరిస్థితులున్నాయి. కొందరు మాత్రం పరిమిత సంఖ్యలో అతిథులను పిలుచుకుని ఆ పెళ్లి తంతును ముగించేస్తున్నారు. అలా కొడుకు పెళ్లి చేద్దామని భావించిన వారిలో కర్ణాటకలోని చిక్‌మగళూరుకు చెందిన మంజునాథ్ అనే రైతు కుటుంబం ఒకటి. కానీ.. తానొకటి తలిస్తే దేవుడు మరొకటి తలచినట్టు పెళ్లి సందడితో కళకళలాడాల్సిన మంజునాథ్ ఇంట్లో కరోనా మహమ్మారి చావు డప్పు మోగించింది. పెళ్లి కొడుకుగా పీటల మీద కూర్చోవాల్సిన మంజునాథ్ కొడుకును కరోనా వైరస్ మృత్యుఒడిలోకి నెట్టేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చిక్‌మగళూరు జిల్లా కొప్ప తాలూకాలోని దేవరకొడిగె గ్రామానికి చెందిన మంజునాథ్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన కొడుకు పృథ్వీరాజ్ బెంగళూరు నగరంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. కర్ణాటక ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో సొంతూరికి వెళ్లాడు. పృథ్వీకి అప్పటికే పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఏప్రిల్ 29న పెళ్లి జరగాల్సి ఉంది. రెండు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాయి. ఇంటిని తోరణాలతో అలంకరించారు. అమ్మాయి తరపు వాళ్ల బంధువులు, అబ్బాయి తరపు బంధువులు ఇళ్లకు చేరుకున్నారు. అయితే.. ఏప్రిల్ 29కి సరిగ్గా రెండు రోజుల ముందు పృథ్వీ ఉన్నట్టుండి ఉదర సంబంధ సమస్యతో, శ్వాస సంబంధ సమస్యతో బాధపడ్డాడు. దీంతో.. పృథ్వీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దామని, కరోనా టెస్ట్ కూడా చేయించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి.

  అయితే.. పృథ్వీకి కరోనా టెస్ట్ చేయించగా నెగిటివ్ వచ్చింది. రెండు ఆసుపత్రుల్లో టెస్ట్ చేయించగా రెండుసార్లూ నెగిటివ్ వచ్చింది. దీంతో.. ఆరోగ్యం కుదుటపడితే అనుకున్న ముహూర్తానికే పెళ్లి చేయాలని పెద్దలు భావించారు. కానీ పృథ్వీ ఆరోగ్య పరిస్థితి అలా లేదు. తొలుత కొప్పలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చింది. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం శివమొగ్గ జిల్లాలోని తిరుత్తహళ్లికి తరలించారు. అక్కడ హాస్పిటల్‌లో టెస్ట్ చేయించగా అక్కడ కూడా నెగిటివ్ గానే వచ్చింది. కానీ.. గంటగంటకూ పృథ్వీ శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు.

  ఇది కూడా చదవండి: Hyderabad: ఆ కూరగాయల కత్తి, ఈ ఎస్‌ఐ గానీ లేకపోతే భార్యతో గొడవపడిన ఈ భర్త పరిస్థితి ఏమయి ఉండేదో..!

  కొడుకును ఎలాగైనా కాపాడుకోవాలని భావించి శివమొగ్గలోని ప్రముఖ హాస్పిటల్ అయిన మెక్‌గాన్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ హాస్పిటల్‌లో పూర్తిగా కోవిడ్ రోగులకే చికిత్సనందిస్తున్నారు. పృథ్వీని కోవిడ్ వార్డులో అడ్మిట్ చేశారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌ సాయంతో చికిత్సనందించారు. చికిత్స పొందుతూ పృథ్వీ ఏప్రిల్ 28న చనిపోయాడు. పెళ్లి ముహూర్తానికి ముందురోజు పృథ్వీ మరణం ఇరు కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టేసింది. ఏప్రిల్ 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చనిపోయాక పృథ్వీకి మెక్‌గాన్ హాస్పిటల్‌లో టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

  పృథ్వీ మరణంపై హాస్పిటల్ సూపర్‌డెంట్ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. అతనిని పరిస్థితి అత్యంత విషమంగా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడికి తీసుకొచ్చారని, తొలుత ట్రీట్‌మెంట్‌కు స్పందించిన పృథ్వీ ఆ తర్వాత ట్రీట్‌మెంట్‌కు కూడా స్పందించే పరిస్థితుల్లో లేకుండా పోయాడని.. అందువల్లే కాపాడలేకపోయామని చెప్పారు. పృథ్వీరాజ్ కోవిడ్ రిపోర్ట్‌ను అతని కుటుంబ సభ్యులకు మొబైల్ ద్వారా పంపినట్లు డాక్టర్ తెలిపారు.
  Published by:Sambasiva Reddy
  First published: