న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఓ బర్త్‌డే పార్టీలో జరిగిన గొడవ విషాదం నింపింది. అన్న బర్త్‌డే పార్టీ తమ్ముడి ప్రాణం తీసింది. పూర్తి వివరాల్లోకెళితే.. ఢిల్లీకి చెందిన అంజు శర్మ అనే యువకుడిని నవీన్ కుమార్ అనే యువకుడు క్షణికావేశంలో కాల్చి చంపాడు. అంజుశర్మ అన్నయ్య పుట్టినరోజు వేడుకలు నజఫ్గర్లోని ఓ ఫామ్‌హౌస్‌లో జరుగుతున్నాయి. తన అన్నయ్య బర్త్‌డే కావడంతో అంజుశర్మ డీజే ఏర్పాటు చేయించి పాటలతో హోరెత్తించాడు. అయితే.. ఆ డీజే పాటల విషయంలో అంజు శర్మకు, అతని అన్నయ్య స్నేహితుడు నవీన్‌కు మధ్య చిన్నపాటి గొడవ జరిగింది.
నవీన్ అప్పటికే మద్యం సేవించి ఉండటంతో అతని నోటి దురుసుతో గొడవ కాస్తా చిలికిచిలికి గాలివానగా మారింది. దీంతో.. కొంత సహనం కోల్పోయిన అంజు శర్మ కూడా కయ్యానికి కాలుదువ్వాడు. దీంతో.. నవీన్ తన వద్ద ఉన్న తుపాకితో అంజుపై కాల్పులు జరిపి పారిపోయాడు. బుల్లెట్ తగలడంతో గాయపడిన అంజుశర్మను హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అంజును పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.
తప్పించుకుని పారిపోయిన నవీన్‌ను పోలీసులు సీసీ ఫుటేజ్‌తో పాటు అతని కాల్ డీటెయిల్స్ రికార్డ్స్ ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు బాబా హరిదాస్ నగర్లో ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లామని, అతనిని అదుపులోకి తీసుకున్నామని ద్వారకా డీసీపీ సంతోష్ కుమార్ మీనా చెప్పారు. నవీన్ వద్ద లైసెన్స్ లేని తుపాకి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Delhi, Gun fire