A 25 YEARS OLD DELHI MAN STABBED TO DEATH AFTER BIRTHDAY PARTY ARGUMENT POLICE ARRESTED ACCUSED MS
పుట్టినరోజు పార్టీలో గొడవ.. మిత్రుడిని కత్తితో పొడిచిన దుండగులు.. హత్యపై వీహెచ్పీ సంచలన ఆరోపణలు
ప్రతీకాత్మక చిత్రం
పుట్టినరోజు పార్టీకి వెళ్లిన వారంతా గొడవకు దిగారు. అంతకుముందే వారి మధ్య వ్యాపార లావాదేవీలలో వివాదాలు నడుస్తున్నాయి. అదే కోపం మీద బాధితుడి ఇంటికి వెళ్లిన నిందితులు.. అతడిని హత్య చేశారు. కానీ బాధితుడి హత్యకు వ్యాపారలావాదేవీలు కాదని.. మరో కారణముందని విశ్వహిందూ పరిషత్ ఆరోపిస్తున్నది.
వాళ్లు ఐదుగురు మిత్రులు. మరో మిత్రుడి పుట్టినరోజుకు వెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత... వ్యాపారానికి సంబంధించిన మాటలు మితిమీరాయి. గొడవ చిలికి చిలికి గాలి వాన అయింది. ఐదుగురు అక్కడే దాడి చేసుకునే స్థితికి వెళ్లారు. కానీ మధ్యవర్తులు వారికి నచ్చజెప్పి ఇంటికి పంపించారు. అయినా కోపంతో రగిలిపోయిన మరో నలుగురు.. గొడవ పెట్టుకున్న వ్యక్తి ఇంటికెళ్లి మరీ హత్య చేశారు. అయితే అతడి హత్య వ్యాపారం విషయంలో కాదని.. అయోధ్యలో రాముడి గుడికి విరాళాలు సేకరిస్తున్నందుకే అంటుంది విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ).. అసలేం జరిగిందంటే..
ఢిల్లీలో బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఢిల్లీలోని మంగోలాపురిలో చోటుచేసుకుందీ ఘటన. అదే ప్రాంతానికి చెందిన రింకూ శర్మ.. కొద్దిరోజుల క్రితం తన మిత్రులు జాహీద్, దానిష్, మెహ్తాబ్, ఇస్లాం లతో కలిసి ఒక ఫుడ్ బిజినెస్ స ప్రారంభించారు. అయితే కొద్దిరోజుల పాటు కాస్తో కూస్తో నడిచిన ఆ వ్యాపారం.. ఆ తర్వాత పూర్తి నష్టాల్లోకి వెళ్లింది. దీంతో వారి మధ్య వ్యాపార పరంగా పలు వివాదాలు, విబేధాలున్నాయి.
అయితే.. బుధవారం రాత్రి వీళ్లందరికీ కామన్ ఫ్రెండ్ అయిన ఒక వ్యక్తి పుట్టినరోజు వేడుకకు వెళ్లారు ఈ ఐదుగురు. అక్కడ వ్యాపార నష్టాలకు సంబంధించిన విషయం తెరమీదకు వచ్చింది. అంతే.. ఒకరిపై ఒకరు వాదులాటకు దిగారు. వ్యాపారం నీ వల్లే అంటే నీ వల్లే నష్టమైందని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. చివరికి ఆ వాగ్వాదం కొట్టుకునే స్థాయికి వెళ్లింది. కానీ మధ్యవర్తులుగా ఉన్నవాళ్లు ఆ గొడవను సద్దుమణిగేలా చేశారు.
బుధవారం రాత్రి రింకూ శర్మ ఇంటికి వెళ్లిన తర్వాత కొద్దిసేపటికి తలుపు చప్పుడైంది. దీంతో అతడు వెళ్లి తలుపు గడియ తీయగానే.. జాహీద్, మెహ్తాబ్, దానిష్, ఇస్లాం లు. నలుగురు కలిసి అతడిపై దాడి చేసి కత్తితో పొడిచారు. అనంతరం అక్కడ్నుంచి పారిపోయారు. శరీరం నిండా కత్తిపోట్లతో ఉన్న రింకూ ను వారి కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. కానీ రక్తస్రావం ఎక్కువ కావడంతో అతడు పరిస్థితి విషమించి మృతి చెందాడు.
ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను గురువారం అరెస్టు చేశారు. ఇదిలాఉండగా.. రింకూ శర్మ హత్యకు కారణం వ్యాపార లావాదేవీలు కాదని విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆరోపిస్తున్నారు. రింకూ.. వీహెచ్పీ కార్యకర్త అని.. అతడు అయోధ్యలో రామ మందిరానికి విరాళాలు సేకరిస్తున్నందునే దుండగులు అతడిని హత్య చేశారని ఆరోపిస్తున్నది. కాగా.. పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు.