వెల్లూరు: పెద్దలు ఆ జంటకు పెళ్లి (Marriage) చేశారు. ఒకరికొకరు జీవితాంతం తోడునీడగా ఉండాలని ఆకాంక్షించారు. వేదమంత్రాల నడుమ ఆ యువతి మెడలో యువకుడు మంగళసూత్రం కట్టాడు. బంధుమిత్రులంతా ఆ జంటను ఆశీర్వదించారు. కానీ.. ‘Happy Married Life’ అని చెప్పిన మరుసటి రోజే ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. రెండు కుటుంబాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ యువతికి ఇష్టం లేని పెళ్లి చేశారా లేక మరేదైనా కారణం వల్ల ఆత్మహత్యకు పాల్పడిందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఘటన తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. వెల్లూరులోని (Vellore) ముత్తుమండపం ప్రాంతానికి చెందిన భువనేశ్వరి అనే 21 ఏళ్ల యువతి నర్సింగ్ మూడో సంవత్సరం (Nursing Student) చదువుతోంది. ఈమెకు పెద్దలు పెళ్లి చేయాలని నిర్ణయించారు. మంచి సంబంధం చూడమని మధ్యవర్తులకు చెప్పగా ఒకరు రాణిపేట్ (Ranipet) జిల్లాలోని కావేరిపక్కం ప్రాంతానికి చెందిన మణికందన్ అనే 28 ఏళ్ల యువకుడి గురించి చెప్పారు. అబ్బాయి చాలా మంచివాడని, ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడని భువనేశ్వరి తల్లిదండ్రులకు చెప్పారు. భువనేశ్వరి తల్లిదండ్రులు అన్నీ ఆలోచించి అబ్బాయి గురించి ఆరా తీసి ఎట్టకేలకు అతనితో కూతురి పెళ్లి నిశ్చయించారు.
నవంబర్ 15న దివ్యమైన ముహూర్తం ఉందని పురోహితుడు చెప్పడంతో ఆ రోజే పెళ్లి చేయాలని భావించారు. అనుకున్నట్టుగానే నవంబర్ 15న అబ్బాయి ఇంటి దగ్గర మణికందన్, భువనేశ్వరిల వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలు వీరి పెళ్లిని అట్టహాసంగానే జరిపించాయి. నవంబర్ 15న పెళ్లైంది. నవంబర్ 16న(మంగళవారం) రాత్రి నూతన వధూవరులు ఇద్దరూ అమ్మాయి ఇంటికి చేరుకున్నారు. భర్తతో భువనేశ్వరి ముభావంగా కూడా లేదు. పెళ్లిలో కూడా నవ్వుతూ కనిపించింది. కానీ.. ఏం జరిగిందో తెలియదు గానీ భర్తతో కలిసి పుట్టింటికి వచ్చిన భువనేశ్వరి ఇంట్లోని ఓ గదిలో ఉరేసుకుని కనిపించింది. భువనేశ్వరి అమ్మమ్మ, సోదరుడు ఆమె ఉరికి వేలాడుతూ ఉండటం చూశారు. కిటికీకి చున్నీతో ఉరేసుకుని కనిపించిన ఆమెను చూసి భర్త, ఆమె కుటుంబం షాక్‌కు లోనైంది. పెళ్లైన రెండో రోజే ఇలా జరగడం పెను విషాదాన్ని నింపింది.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెల్లూరు నార్త్ పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడిన గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. భువనేశ్వరి మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించి అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు రెండు కోణాల్లో ఈ కేసును విచారిస్తున్నారు. ఒకటి.. ఆమెకు పెళ్లి చేయడం వల్ల చదువు ఆగిపోయిందన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిందా లేక ఎవరినైనా ప్రేమించి పెద్దల మాట కాదనలేక పెళ్లి చేసుకుని ప్రియుడిని మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుందా అనే కోణాల్లో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. ఏదేమైనా.. కూతురికి పెళ్లి చేసిన ఆమె తల్లిదండ్రులు పెళ్లైన రెండో రోజే ఆమె ఆత్మహత్యకు పాల్పడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: After marriage, Crime news, Newly Couple, Telangana crime news