నిశ్చితార్థానికి 40 మందితో వెళ్తున్న బస్సుకు కరెంటు తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 22 మంది గాయపడ్డారు. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. పెళ్లి ఖాయం చేసుకోవడానికి వెళ్తున్న బస్సుకు 11కేవీ విద్యుత్ వైర్లను తాకాయి. దీంతో బస్సుకు మంటలు అంటుకున్నాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు ఫోన్ చేశారు. తలో చేయి వేసి మంటలను ఆర్పివేశారు. అనంతరం బాధితులను బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి వైద్యసాయం అందించాలని ఆదేశించారు. గాయపడిన వారికి బరంపూర్‌లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ & హాస్పటల్లో చికిత్స అందిస్తున్నారు. ఐదుగురికి సీరియస్‌గా ఉండడంతో వారిని కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పద్మనాభ బెహరా స్పందించారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:February 09, 2020, 20:59 IST