ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న 9 నెలల చిన్నారిపై పులి దాడిచేసింది. పసివాడిని నోటకరచుకొని వెళ్లి కాలుని తినేసింది. అనంతరం చంపి ఊరి బయట పొదల్లో విసిరేసి వెళ్లింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా గడబోరి గ్రామంలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సచిన్ గురునలే దంపతులు తమ తొమ్మిదేళ్ల కుమారుడు రాకేశ్ కలిసి ఆదివారం రాత్రి మంచంపై నిద్రపోయారు. ఐతే అర్ధరాత్రి దాటాక సచిన్ భార్యకు దాహం వేయడంతో నీళ్లు తాగేందుకు ఇంట్లోకి వెళ్లింది. ఆ సమయంలో పులి అక్కడకు వచ్చి చిన్నారిపై దాడిచేసింది. అమాంతం నోట కరచుకొని అడవిలోకి పారిపోయింది. పసివాడి ఏడుపు విన్న తల్లిదండ్రులు స్థానికులతో కలిసి చుట్టుపక్కల గాలించారు. కానీ ఎక్కడా ఆచూకీ దొరకలేదు.
ఘటనను పోలీసులు, అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకురావడంతో వారు గ్రామానికి చేరుకొని గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో వాకల్ రహదారి పక్కన ఉన్న చెరువు సమీపంలో బాలుడి మృతదేహం కనిపించింది. వెదురు పొదల్లో తీవ్ర గాయాలతో ఉన్న డెడ్ బాడీ లభ్యమైంది. ఓ కాలునూ పులి తినేసిందని స్థానికులు తెలిపారు. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన చుట్టుపక్కల ప్రజలు..అటవీశాఖ అధికారులను నిలదీశారు. తమకు రక్షణ కల్పించాల్సిందిగా ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. గ్రామం చుట్టూ కంచెతో పాటు విద్యుత్ స్తంభాలు ఏర్పాటుచేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.