Crime: పనిమనిషిని లొంగదీసుకోవడానికి యజమాని స్కెచ్.. చివరికి ఏం జరిగిందో తెలుసా..?

ప్రతీకాత్మిక చిత్ర

కిడ్నాప్, హత్యకు యత్నించిన నిందితుల్లో ఒకరు మెడిసన్ విద్యార్థిగా గుర్తించారు. కిడ్నాప్ సమయంలో గోపీ అనే పేరును నిందితులు ప్రస్తావించడంతో దాని ఆధారంగానే పోలీసులు కేసును ఛేదించారు.

 • Share this:
  వేరే మహిళపై మోజు అతన్ని రాక్షసుడిగా మార్చింది. ఏకంగా హత్యాయత్నానికి ఉసిగొల్పింది. చివరకు కటకటాల పాలు చేసింది. విజయవాడలో పనిమనిషిని లోబర్చుకునేందుకు ఓ ఇంటి యజమాని ఆమె భర్తపై హత్యాయత్నం చేయించాడు. సుపారీ ఇచ్చి మరీ కిరాయిహంతకులను పంపించాడు. చివరకు ప్లాన్ ఫెయిల్ అవడంతో పోలీసులకు చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ మాచవరం డౌన్ కు చెందిన యామర్తి సుబ్బబారావు పండ్ల వ్యాపారి. తన ఇంట్లో పనిచేసే మహిళపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా వశపరుచుకోవాలని భావించాడు. అందుకు అడ్డుగా ఉన్న ఆమె భర్త అచ్యుతరావును హత్య చేస్తే తన పని సులువుగా అవుతుందని భావించాడు. అనుకున్నదే తడవుగా హత్యకు పథకం వేసి తమ సమీప బంధువైన దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన బండ్లమూడి వేణుకు రూ.లక్ష సుపారీ ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు.

  వెంటనే రంగంలోకి దిగిన వేణు.. తన స్నేహితులైన దుగ్గిరాల మండలం పెదపాలేనికి చెందిన పల్లెకోన గోపి, మంగళగిరి మండలం నూతక్కికి చెందిన లంకిరెడ్డి సాంబిరెడ్డి, మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన కన్యకాపురం గోపి, కుంచనపల్లికి చెందిన కాసరనేని వాసుదేవ్‌తో కలిసి సుబ్బారావు దగ్గరకు వెళ్లి మర్డర్ ప్లాన్ వేశారు.

  పక్కా స్కెచ్
  అచ్యుతరావును కిడ్నాప్ చేసి ఓ తోటలోకి తీసుకెళ్లి హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి రెండు బృందాలుగా విడిపోయారు. ఈనెల 6వ తేదీ సాయంత్రం 6గంటల సమయంలో అచ్యుతరావు తన భార్య, కుమారుడితో కలిసి బైక్ వెళ్తుండగా.. వేణు, గోపీ, సాంబిరెడ్డి అతన్ని అనుసరించారు. మధ్యలో బైక్ పెట్రోల్ అయిపోవడంతో దగ్గర్లోని బంక్ వద్దకు ఒంటరిగా వెళ్లారు. అక్కడే మాటు వేసిన నిందితులు అచ్యుతరావును బలవంతంగా స్కూటీ ఎక్కించుకొని మల్లెంపూడి, గుండిమెడ డొంకరోడ్డులోని అరటితోటకు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న మరో ముగ్గురు నిందితులకు సమాచారమిచ్చారు. అందరూ కలిసి అచ్యుతరావుపై రాళ్లతో దాడి చేయగా.. పల్లికోన గోపి సెలూన్ లో ఉపయోగించే బ్లేడుతో ముఖంపై కోసి తీవ్రంగా గాయపరిచాడు. అతని వద్ద ఉన్న రూ.42 వేలు నగదు, రెండు సెల్ ఫోన్లను తీసుకోని పారిపోయారు. సెల్ ఫోన్లను రేవేంద్ర పాడు వద్ద కృష్ణా కెనాల్ లో పారేశారు.

  ఎలా దొరికారంటే..!
  బాధితుడు అచ్యుతరావును కిడ్నాప్ చేసిన ముగ్గురు నిందితులు.. ఫోన్లో గోపీ పేరును ప్రస్తావించడం కేసులో కీలకంగా మారింది. దాని ఆధారంగ పోలీసులు కేసును ఛేదించారు. అలాగే అచ్యుతరావుతో అతని ఫోన్ నుంచే అతని భార్య పనిచేసే ఇంటి యజమానికి ఫోన్ చేయించారు. ఈ విషయాన్ని అచ్యుతరావు.., సుబ్బారావు భార్యకు చెప్పాడు. దర్యాప్తులో భాగంగా సుబ్బారావు కాల్ డేటాను పరిశీలించగా.. నిందితులతో పదేపదే మాట్లాడినట్లు గుర్తించారు. అరెస్టైన వారిలో ఒకరు మెడిసన్ విద్యార్థిగా గుర్తించారు. కేసులో ప్రధాన నిందితుడైన సుబ్బారావును కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
  Published by:Purna Chandra
  First published: