Peshawar blast : ఓ వైపు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న మన పొరుగుదేశం పాకిస్తాన్(Pakistan) లో వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. సోమవారం పెషావర్(Peshawar) లోని పోలీస్ లైన్స్ ప్రాంతంలోని ఓ మసీదులో మధ్యాహ్నాం 1:40 సమయంలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. మసీదులో మధ్యాహ్నాం నమాజ్ సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో అందరూ ఉలిక్కిపడ్డారు. 150మందికి పైగా మసీదులో ప్రార్థనలు చేస్తున్న సమయంలో పేలుడు పదార్థాలతో వచ్చిన ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని స్థానిక పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.మసీదు లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఆత్మాహుతి దాడి ఘటనలో 63మంది మృతి చెందగా, మరో 150 మంది గాయపడ్డారు. పేలుడు ప్రభావానికి మసీదు ప్రాంతం కుప్పకూలగా ఆ శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించారు. ఇందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులలో ఎక్కువగా పోలీసులే ఉన్నారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. పేలుడు జరిగిన ప్రదేశాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మసీదు వైపు రోడ్లను మూసీవేసిన అధికారులు.. ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు.పెషావర్‌లోని ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బాధితుల కోసం రక్తదానం చేయాలని ఆసుపత్రి.. పౌరులకు విజ్ఞప్తి చేసింది.
ఈ ఘటనపై పాక్ ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్,పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ పెషావర్‌కు వెళ్లి సహాయక చర్యలను సమీక్షించారు. ఆర్మీ చీఫ్‌తో పాటు ప్రధాని కూడా పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రిని సందర్శించి క్షతగాత్రుల ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా, ఇతర అధికారులు పాల్గొన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని హామీ ఇచ్చారు. ఈ దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Photos : మనదేశంలో స్విట్జర్లాండ్ ను తలపించే అందమైన ప్రదేశం..కశ్మీర్ లో కాదండోయ్!
ఇక,ఈ ఘటనపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో మరణించిన కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. దేశంలో ఉగ్రవాద ముప్పును అరికట్టాలని కోరారు. పెరుగుతున్న ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి గూఢచార సేకరణను మెరుగుపరచడం, పోలీసు బలగాలను సరిగ్గా సన్నద్ధం చేయడం అత్యవసరం అని ఇమ్రాన్ ఖాన్ ఓ ట్వీట్ లో తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bomb blast, Crime news, Pakistan, Terror attack