550 VIALS OF COVID VACCINES STOLEN FROM HYDERABAD JAMBAGH UPHC RACHAKONDA CP SAYS THIEF WHATSAPP GROUP MKS
Hyderabad: కరోనా విలయంలో భారీగా వ్యాక్సిన్ల చోరీ.. దొంగలకూ whatsapp గ్రూపులు
జాంబాగ్ ఆస్పత్రిలో టీకాల చోరీ
కరోనా దెబ్బకు అందరూ కుదేలైపోతుండగా, దొంగలు మాత్రం ఎంచక్కా తమ పనిలో బిజీ అయిపోయారు. సంక్రాంతి పండక్కి సిటీ నుంచి సొంత ఊళ్లకు వెళ్లినవారి ఇళ్లను టార్గెట్ చేస్తూ నగరంలో దొంగతనాలు పెరిగాయి. అయితే, అనూహ్య రీతిలో ప్రభుత్వ ఆస్పత్రి నుంచి భారీ ఎత్తున వ్యాక్సిన్లు కూడా చోరీకి గురికావడం సంచలనం రేపుతోంది..
దేశంలో మెట్రో నగరాలు కొలువైన రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలోనూ కరోనా విలయం కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ ఎత్తున కొత్త కేసులు వస్తున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం నిన్న(సోమవారం) ఒక్కరోజే 1825కొత్త కేసులు వచ్చాయి. పాజిటివిటీ రేటు రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 15వేలుగా ఉంది. సంక్రాంతి తర్వాత తెలంగాణలోనూ భారీ ఎత్తున ఆంక్షలు విధించే దిశగా కేసీఆర్ సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు కరోనా దెబ్బకు అందరూ కుదేలైపోతుండగా, దొంగలు మాత్రం ఎంచక్కా తమ పనిలో బిజీ అయిపోయారు. సంక్రాంతి పండక్కి సిటీ నుంచి సొంత ఊళ్లకు వెళ్లినవారి ఇళ్లను టార్గెట్ చేస్తూ నగరంలో దొంగతనాలు పెరిగాయి. అయితే, అనూహ్య రీతిలో ప్రభుత్వ ఆస్పత్రి నుంచి భారీ ఎత్తున వ్యాక్సిన్లు కూడా చోరీకి గురికావడం సంచలనం రేపుతోంది..
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జాంబాగ్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్(యూపీహెచ్సీ) కేంద్రంలో వ్యాక్సిన్లు చోరీకి గురైన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మీర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాంబాగ్ ఆస్పత్రి తలుపులు బద్దలుకొట్టిమరీ లోపలికి ప్రవేశించిన దొంగలు.. అక్కణ్నుంచి 550 కొవిడ్ వ్యాక్సిన్ వెయిల్స్ ను ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం సిబ్బంది వచ్చి చూసుకున్నాకగానీ కరోనా టీకాలు ఇతర వస్తువులు మాయమైన విషయాన్ని గుర్తించలేదు.
దుండగులు ఎత్తుకెళ్లిన 550 కొవిడ్ టీకాల వాయిల్స్ లో 340 డోసుల కొవిషీల్డ్ టీకాలు, 270 కొవాగ్జిన్ డోసులూ ఉన్నట్లు తేలింది. కరోనా టీకాలతోపాటు ఆస్పత్రిలోని మూడు కంప్యూటర్లను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. అనుమానితులను గుర్తించి తమదైన శైలిలో విచారించగా దొంగలెవరో బయడపడింది. జాంబాగ్ ప్రాంతంలో గంజాయికి అలవాటుపడి చిల్లరగా తిరిగే ఇద్దరు వ్యక్తులే ఆస్పత్రిలో కొవిడ్ టీకాలు, కంప్యూటర్లు చోరీ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆ ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు.ఇదిలా ఉంటే,
ఓల్డ్ సిటీలో వ్యాక్సిన్ల చోరీకితోడు రాచకొండ కమిషనరేట్ పరిధిలో సంక్రాంతి దొంగల తాకిడి పెరిగింది. పండక్కి ఊరెళుతోన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సరికాదని, దొంగలు కూడా సోషల్ మీడియాను విరివిగా వాడుతున్నట్లు ఆధారాలున్నాయిని, దొంగలకూ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే దొంగలు.. ఏ ఇంటివారు సంక్రాంతికి ఊరెళ్లాలో కనిపెట్టిమరీ, ఆ సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకుంటూ చోరీలకు పాల్పడుతున్నారని, కాబట్టి ప్రజలు పండక్కి ఊరెళ్లేముందు స్థానిక పోలీస్ స్టేషన్ కు ఇన్ఫామ్ చేయడం మంచిదన్నారు భగవత్. విలువైన వస్తులు, బంగారం, నగదును ఇంట్లో దాచుకునే కంటే బ్యాంకుల్లో ఉంచుకోవాలని, ఏది ఏమైనా 100కు ఫోన్ చేస్తే ప్రజలకు ఎలాంటి సహాయాన్నయినా పోలీసులు అందిస్తారని సీపీ భరోసా ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.