ఉద్దెర ఇచ్చేది లేదన్న మహిళ.. నన్నే డబ్బులడుగుతావా..? అంటూ గర్భిణిపై కత్తితో దాడి చేసిన దుండగుడు

ప్రతీకాత్మక చిత్రం

దుకాణంలో సరుకులు ఉద్దెర ఇవ్వనన్నదని పట్టపగలే మహిళ అని కూడా చూడకుండా... (అందునా ఆమె ఐదునెలల గర్భిణి కూడా) ఆమెపై కత్తితో దాడి చేశాడో దుండగుడు.

 • News18
 • Last Updated :
 • Share this:
  పెద్దపెల్లి జిల్లాలో కొద్దిరోజులుగా సాగుతున్న రక్తపాతాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నడిరోడ్డుమీద చుట్టూ వందలాది జనం చూస్తుండగానే న్యాయవాదులు వామన్ రావు దంపతులను హత్య చేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ హత్యోదంతం మరిచిపోకముందే పెద్దపెల్లి జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టపగలే మహిళ అని కూడా చూడకుండా... (అందునా ఆమె ఐదునెలల గర్భిణి కూడా) ఆమెపై కత్తితో దాడి చేశాడో దుండగుడు.  గోదావరిఖనిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

  గోదావరిఖని లోని సీతానగర్ కు చెందిన అనూష ఐదు నెలల గర్భిణీ. ఇంటి దగ్గర ఉంటూ కిరాణ షాపు పెట్టుకుని ఆమె కుటుంబం ఉపాధి పొందుతున్నది. అదే వీధికి చెందిన శ్రీకాంత్.. ఆ దుకాణంలోనే కిరాణ వస్తువులు తీసుకెళ్తాడు. ఈ క్రమంలో ఆ కిరాణంలో రోజూవారీ ఖాతాను కూడా పెట్టాడు శ్రీకాంత్. అయితే కొద్దిరోజులుగా శ్రీకాంత్.. తనకు అవసరమైన వస్తువులను తీసుకుపోతున్నాడే గానీ డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో ఆమె.. ఖాతా పెరిగిపోతుందని, డబ్బులివ్వందే సరుకులు ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పింది.

  ఈసారికి సరుకులు ఇవ్వాలని.. కొద్దిరోజుల్లోనే డబ్బులు రాగానే ఖాతా డబ్బులు తీరుస్తానని శ్రీకాంత్ చెప్పాడు. కానీ దీనికి ఆమె వినిపించుకోలేదు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన శ్రీకాంత్.. ‘నన్నే డబ్బులడుగుతావా..?’ అంటూ ఇంట్లోకెళ్లి కత్తి తీసుకుని వచ్చి కిరాణం షాపులో ఉన్న ఆమెపై దాడికి దిగాడు. బాధితురాలు వద్దని వేడుకుంటున్నా వినకుండా ఆమెపై కత్తితో గాయాలు చేశాడు. దీంతో ఆమె బిగ్గరగా అరిచింది. ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఘటనాస్థలానికి పరుగెత్తుకుని వచ్చారు. అక్కడికి వస్తున్న వారిని చూసిన శ్రీకాంత్.. దొరికితే తనను బతకనివ్వరని అక్కడ్నుంచి జారుకునే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన పలువురు యువకులు.. శ్రీకాంత్ ను పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.

  బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిపై కేసు నమోదు చేశారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించగా.. ప్రాణాపాయం ఏమీ లేదని కానీ పలు గాయాలయ్యాయని తెలిపారు.
  Published by:Srinivas Munigala
  First published: