ఒకప్పుడు టీచర్...సీన్ కట్ చేస్తే దొంగల ముఠా నాయకుడయ్యాడు!

శంషాబాద్ పోలీసులకు పట్టుబడిన దొంగలు..

వీలైనంత త్వరగా డబ్బు సంపాదించి సంపన్నడుకావాలన్న అత్యాసతో అడ్డదారులు తొక్కాడు ఆ మాజీ టీచర్. దొంగల ముఠాకు నాయకుడయ్యాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇప్పటి వరకు 48 చోరీ కేసుల్లో శ్రీనివాసరావు నిందితుడిగా ఉన్నాడు.

 • Share this:
  పదేళ్లుగా పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని చేస్తూ వచ్చిన ఆ వ్యక్తి...దొంగల ముఠా నాయకుడయ్యాడు. పక్కా స్కెచ్ వేసి ఇళ్లలో దొంగతనాలు ఎలా చేయాలో తన శిష్యగణానికి పాఠాలు నేర్పాడు. వీలైనంత త్వరగా డబ్బు సంపాదించి సంపన్నడుకావాలన్న అత్యాసతో అడ్డదారులు తొక్కాడు. చివరికి పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కబెడుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో రాత్రి పూట ఇళ్ల తలుపులు పగలగొట్టి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాకు చెందిన ఐదుగురిని శంషాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గరి నుంచి 175 గ్రాముల బంగారం, 350 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక హోండా యాక్టివా, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కోసూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి కల్వకర్తిలోని ఓ ప్రైవేట్ పాఠశాల్లో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేసేవాడు. టీచర్‌గా పనిచేస్తే అరకొర జీతాలతో సంపన్నడు కాలేమని నిర్ణయించుకుని...దొంగతనాలు మొదలుపెట్టాడు.

  ఓ చోరీ కేసులో జైలుకెళ్లిన శ్రీనివాస్ జైళ్లల్లో పరిచయమైన దొంగలతో ఓ ముఠాను ఏర్పాటు చేశాడు. ఒక రూమ్ అద్దెకు తీసుకుని ఏడుగురు దొంగలు ఉంటూ.. పగలు రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడేవారు. చోరీకి పాల్పడి అరెస్టు అయ్యే దొంగలను బెయిల్‌పై విడుదల చేసేందుకు న్యాయవాదులను సమకూర్చేవాడు. దొంగతనాలకు అవసరమైన పరికరాలను కూడా ఏర్పాటు చేసేవాడు. దొచుకున్న బంగారం, వెండి ఆభరణాలను తాకట్టు పెట్టడం, దాన్ని విడిపించడంలో కమిషన్లు తీసుకునేవాడు. తద్వారా రెండు వైపులా లాభాలు ఆర్జిస్తూ జల్సాలు చేసేవాడు.

  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇప్పటి వరకు 48 చోరీ కేసుల్లో నిందితుడిగా శ్రీనివాసరావు ఉన్నాడు. తెలంగాణలోని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ తోపాటు , మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ తో పాటు..ఏపీలోని విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చోరీలకు పాల్పడినట్టు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దొంగల ముఠాను అరెస్టు చేసిన పోలీసులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అభినందించారు. డబ్బును బ్యాంకు లాకర్లలో దాచుకోవాలని.. ఇళ్లల్లో బీరువాల్లో డబ్బు దాచుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. దొంగతనాలు జరుగకుండా ఉండేందుకు సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. పరారీలో ఉన్న వీరి ముఠాకు చెందిన మరో ఇద్దరు దొంగల కోసం గాలిస్తున్నారు.
  Published by:Janardhan V
  First published: