అహ్మదాబాద్: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు సహజం. కానీ ఆ గొడవలు ముదిరితే ఆ కాపురం ఎక్కువ కాలం నిలవదు. ప్రతీ చిన్న విషయంలోనూ ఒకరినొకరు అనుమానించుకుంటూ ప్రశాంతతను దూరం చేసుకుంటారు. అహ్మదాబాద్‌లో భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ భార్యపై దాడికి దారితీసింది. అశోక్‌నగర్‌కు చెందిన ఓ వివాహిత గోమతిపూర్ పోలీస్ స్టేషన్లో తన భర్తపై చేసిన ఫిర్యాదు వార్తల్లో నిలిచింది. ఆదివారం ఎక్కడికి వెళుతున్నావని అడిగినందుకు తనపై భర్త దాడి చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
గత ఫిబ్రవరితో తనకు వివాహమైందని, ఆరు నెలల వరకూ తన వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిందని ఆమె తెలిపింది. గత నెల నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని.. అత్తమామలు, బావమరిది తనను వేధించసాగారని ఆమె చెప్పింది. దీంతో.. అప్పటి నుంచి వేరు కాపురం ఉంటూ భర్తతో కలిసి ఉంటున్నానని తెలిపింది. గత శుక్రవారం భర్త బాగా పొద్దుపోయాక ఇంటికి రావడంతో ఎందుకు ఇంత ఆలస్యమైందని అడిగినందుకు తనపై చేయి చేసుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
అంతేకాకుండా.. ఆదివారం కూడా ఉదయం 8 గంటలకల్లా రెడీ అయి ఎక్కడికో వెళుతున్నాడని.. ‘ఇవాళ ఆదివారం కదా.. ఇంత ఉదయాన్నే రెడీ అయి ఎక్కడికి వెళుతున్నావు’ అని అడిగినందుకు తనపై దాడి చేశాడని.. ఛాతి భాగంలో తన్ని కనికరం లేకుండా కొట్టాడని తెలిపింది. గాయపడి తాను బాధపడుతూ ఉంటే తన భర్త కనీసం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడని తాను అన్నావదినలకు ఫోన్ చేశాక... వాళ్లు వచ్చి తనను శారదాబెన్ ఆస్పత్రిలో చేర్చారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె భర్తపై కేసు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ahmedabad, Crime news, Gujarat, Married women