తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా పచ్చదనాన్ని పెంచేందుకు వందల కోట్లు ఖర్చుపెట్టి మొక్కలు నాటిస్తోంది. కేవలం మొక్కలు నాటి చేతులు దులుపుకోవడమే కాదు..వాటి సంరక్షణ బాధ్యతలను కూడా అధికారులకు అప్పగించింది. ఐతే కొన్ని చోట్ల హరితహారం మొక్కలను పశువుల, గొర్రెలు మేస్తున్నాయి. హరితహారం మొక్కలని తెలిసి కూడా యజమానులు వాటిని ఆపడం లేదు. తింటే ఏమవుతుంది? ఎవరు అడుగుతారు? అని లైట్‌గా తీసుకుంటున్నారు. అలాంటి వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు అధికారులు.
తాజాగా నారాయణపేట జిల్లాలోనూ మేకలకు జరిమానా విధించారు. కృష్ణ, మునిరాబాద్ రైల్వేలైన్‌లో నాటిన హరితహారం మొక్కలను మేకలు తినడంతో వాటికి ఫైన్ వేశారు. మూడు మేకలకు రూ.10వేలు జరిమానా విధించారు జిలా కలెక్టర్ వెంకట్రావు. ఎంపీడీవీలో కార్యాలయంలో వాటిని కట్టేశారు. మేకల యజమాని 10వేలు కడితేనే మేకలను విడిచిపెట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
కరీంనగర్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. మొక్కలను తిన్నందుకు రెండు మేకలను పోలీసులు అరెస్ట్ చేశారు. సేవ్ ద ట్రీ అనే స్వచ్చంధ సంస్థ ఫిర్యాదు మేరకు మేకలను పట్టుకొని పోలీస్ స్టేషన్లో కట్టివేశారు. మేకల యజమానులు వెయ్యి రూపాయలు జరిమానా కట్టిన తర్వాత వాటిని వదలిపెట్టారు. హరితహారం మొక్కలను మేయకుండా పశువుల యజమానులు జాగ్రత్త వహించాలని.. లేదంటే భారీ జరిమానాలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Haritha haram, Telangana, Telangana News