వివాహేతర సంబంధాలు ఎన్నో దారుణాలకు కారణమవుతున్నాయి. ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం వల్ల ఓ యువకుడి ప్రాణం పోయింది. ఓ పెళ్లయిన మహిళతో కలిసి ఆ యువకుడు ఎస్కేప్ అయ్యాడు. గ్రామస్తులు కష్టపడి ఎలాగోలా వారిద్దరినీ బస్టాండ్ లో ఉండగా పట్టుకున్నారు. ఊరికి తీసుకొచ్చి పంచాయతీ పెట్టారు. కనీవినీ ఎరుగుని రీతిలో భారీ జరిమానాను విధించారు. తనతోపాటు వచ్చిన ఆ మహిళ కూడా మాట మార్చడంతో ఆ యువకుడు మనస్తాపానికి గురయ్యాడు. చివరకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జనగామ జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని అబ్దుల్ నాగారం గ్రామ శివారులోని వాలయ తండాకు చెందిన బానోతు రాజు అనే 23 ఏళ్ల కుర్రాడు అదే తండాలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
20 రోజుల క్రితం ఇద్దరూ తండా నుంచి ఎస్కేప్ అయ్యారు. హన్మకొండకు చేరుకున్నారు. వారిద్దరూ పారిపోయారని తెలిసి ఆ మహిళ బంధువుల వెతకడం ప్రారంభించారు. మొత్తానికి ఆ మహిళ బంధువుల హన్మకొండ బస్టాండ్లో వారిద్దరినీ పట్టుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అయితే గ్రామస్తులు వచ్చి ఈ సమస్యను ఊరికి వెళ్లి సానుకూలంగా పరిష్కరించుకుంటామని పోలీసులతో చెప్పారు. పోలీసులు వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆ గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య పంచాయతీ జరిగింది. ఈ పంచాయతీ కోసం పెద్దమనుషులు డిపాజిట్ కింద లక్ష రూపాయలు తీసుకున్నారు. అతడితోపాటు వెళ్లిన మహిళ పంచాయతీలో మాత్రం మాట మార్చింది. తనను రాజు బలవంతంగా తీసుకెళ్లాడని వివాహిత పెద్దమనుషుల ముందు చెప్పింది.
ఇది కూడా చదవండి: అమరావతి సచివాలయం నుంచి నేరుగా గ్రామ వలంటీర్ కు ఫోన్ కాల్.. చివరకు జరిగింది చూసి అంతా షాక్..!
దీంతో ఆ పెద్దమనుషులు తప్పంతా రాజుదేనని తేల్చారు. 20 లక్షల రూపాయలను ఆమె కుటుంబానికి పరిహారంగా చెల్లించాలని పంచాయతీలో తేల్చారు. అలా డబ్బును ఇవ్వకపోతే రాజుకు చెందిన ఎకరం భూమిని ఆమె కుటుంబానికి అప్పగిస్తామని పెద్దమనుషులు తీర్పునిచ్చారు. పంచాయతీలో ఆమె మాటమార్చడం, భారీ జరిమానా విధించడంతో రాజు మనస్తాపానికి గురయ్యాడు. అదే రోజు రాత్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. సోమవారం ఉదయం బావి వద్ద అతడిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగానే రాజు మృతి చెందాడు. కాగా, ఈ ఘటనకు ఊళ్లో పంచాయతీ జరిపిన పెద్దమనుషులే కారణమని యువకుడి తాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: పెళ్లి తర్వాత సినిమాలు మానేయమని రాజీవ్ కండీషన్ పెట్టాడు.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన యాంకర్ సుమ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Crime story, CYBER CRIME, Husband kill wife, Illegal affairs, Lovers suicide, Wife kill husband