Very Sad: ఈ మధ్యే నిశ్చితార్థం జరిగింది.. రోజూలానే ఉదయం 7 గంటలకు నడుచుకుంటూ ఆఫీస్‌కు వెళుతుండగా..

బాధితురాలు అనిత

కెంగేరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. తనతో పెళ్లికి ఒప్పుకోలేదని యువతిని పట్టపగలు నడిరోడ్డుపై ఓ యువకుడు గొంతు కోసి హత్య చేశాడు. ఆమె ఆఫీస్‌కు నడుచుకుంటూ వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనిత(23), వెంకటేష్(27) బెంగళూరులోని ఎఫ్‌ఎంసీజీ సంస్థలో గత రెండేళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు.

 • Share this:
  బెంగళూరు: కెంగేరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. తనతో పెళ్లికి ఒప్పుకోలేదని యువతిని పట్టపగలు నడిరోడ్డుపై ఓ యువకుడు గొంతు కోసి హత్య చేశాడు. ఆమె ఆఫీస్‌కు నడుచుకుంటూ వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనిత(23), వెంకటేష్(27) బెంగళూరులోని ఎఫ్‌ఎంసీజీ సంస్థలో గత రెండేళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. అనితకు సహోద్యోగి అయిన వెంకటేష్ ఆమెను ఇష్టపడ్డాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని తన మనసులో మాటను అనిత ముందు బయటపెట్టాడు. తన తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోరని.. తనకూ ఈ పెళ్లి ఇష్టం లేదని వెంకటేష్‌కు అనిత చెప్పింది. అయినప్పటికీ వెంకటేష్ తన తీరును మార్చుకోలేదు. ప్రేమ, పెళ్లి పేరుతో ఆమెను వేధించసాగాడు. తనకు బావ ఉన్నాడని.. అతనితోనే తన పెళ్లి జరుగుతుందని అనిత చెప్పడంతో వెంకటేష్ ఉన్మాదిలా మారాడు. వారం రోజుల క్రితం.. అనితకు నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంకటేష్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆగస్ట్ 30న ఉదయం ఆఫీస్‌కు వెళ్లేందుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న అనితను వెంకటేష్ అడ్డగించాడు. తనను పెళ్లి చేసుకోవాలని, ఈ పెళ్లి ఇష్టం లేదని ఇంట్లో చెప్పాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఉన్మాదిలా మారి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో అనిత గొంతు కోసి.. అక్కడి నుంచి పరారయ్యాడు. తాను ప్రేమించిన యువతి తనకు దక్కదేమోనన్న అక్కసుతోనే ఈ ఘోరానికి వెంకటేష్ పాల్పడినట్టు తెలిసింది.

  దొడ్డబెలె రోడ్డులో ఆగస్ట్ 30న ఉదయం 7 గంటల సమయంలో అనిత నడుచుకుంటూ ఆఫీస్‌కు వెళుతుండగా ఈ దారుణం జరిగింది. గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావంతో అనిత కుప్పకూలిపోయింది. రక్తపు మడుగులో ఉన్న అనితను స్థానికులు వెంటనే సమీపంలోని బీజీఎస్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే.. తీవ్ర రక్తస్రావం కావడంతో అప్పటికే అనిత చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. నిందితుడు వెంకటేష్ ఆమెను హతమార్చాలన్న ఉద్దేశంతోనే అడ్డగించినట్టు తేలింది. ఈ మధ్య మార్కెట్‌కు వెళ్లి రూ.80 పెట్టి పదునైన కత్తి కొన్న వెంకటేష్.. అదే కత్తితో ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. అనిత మృతదేహానికి రాజరాజేశ్వరి హాస్పిటల్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం.. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కెంగేరి పోలీసులు నిందితుడు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

  ఇది కూడా చదవండి: Very Sad: ఆరేళ్ల నుంచి ప్రాణంగా ప్రేమించాడు.. కానీ ఆ అమ్మాయి ఈ రేంజ్‌లో షాక్ ఇస్తుందని ఊహించలేకపోయాడు..

  అనితను చివరిగా పెళ్లికి ఒప్పించేందుకు ప్రయత్నించానని.. ఆమె ఒప్పుకోకపోవడంతో క్షణికావేశంలో హత్య చేశానని నిందితుడు పోలీసు విచారణలో చెప్పాడు. తాను మాట్లాడి ఒప్పించేందుకు ఎంతగానో ప్రయత్నించానని.. కానీ ఆమె వినిపించుకోకుండా వెళ్లిపోతుండటంతో ఆమెతో గొడవ పడినట్లు చెప్పాడు. గొడవ ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసి వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయినట్లు వెంకటేష్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ప్రేమోన్మాది ఘాతుకానికి 23 ఏళ్ల యువతి జీవితం ఇలా అర్థాంతరంగా ముగిసిపోయింది. నిశ్చితార్థం జరిగి.. రేపోమాపో పెళ్లి పీటలెక్కాల్సిన వధువు జీవితాన్ని ప్రేమ పిచ్చితో వెంకటేష్ చిదిమేశాడు. ఉదయాన్నే ఆఫీస్‌కు వెళ్లిన కూతురు ఇలా విగత జీవిగా తిరిగొస్తుందని కలలో కూడా ఊహించలేదని అనిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
  Published by:Sambasiva Reddy
  First published: