21 YEARS OLD YOUTH COMMIT SUICIDE IN HOSTEL ROOM AFTER LOVER REFUSED HIS PROPOSAL IN SIDDIPET HSN
సినిమా టికెట్, లాకెట్ ఆ అమ్మాయికి ఇచ్చేయండి.. అమ్మా నాన్నా సారీ.. అంటూ లేఖ రాసి మరీ..
ప్రతీకాత్మక చిత్రం
ప్రేమించిన అమ్మాయి నన్ను కాదంది. నా ప్రేమను తిరస్కరించింది. ఆమె గుర్తుగా దాచుకున్న సినిమా టికెట్, లాకెట్ మరికొన్ని వస్తువులు నా సూట్ కేసులో ఉన్నాయి. వాటిని ఆ అమ్మాయికి తిరిగి ఇవ్వండి.. అంటూ..
ఓ యువతిని ప్రాణంగా ప్రేమించాడా యువకుడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. మంచి ఉద్యోగం తెచ్చుకుని హ్యాపీగా జీవితాన్ని గడపాలనుకున్నాడు. కానీ ప్రేమించిన యువతి అతడి ప్రేమను తిరస్కరించడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆమె తోడు లేని జీవితం తనకు అక్కర్లేదనుకున్నాడు. పరీక్షలు రాసేందుకు కాలేజీ వరకు వెళ్లి.. హాల్ టికెట్ మర్చిపోయానని హాస్టల్ కు తిరిగొచ్చాడు. అతడు పరీక్షలకు ఎందుకు రాలేదో చూడమని కాలేజీ యాజమాన్యం అటెండర్ ను పంపిస్తే, అతడు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. హాస్టల్ లో తన గదిలో ఆత్మహత్య చేసుకున్నది చూసి ఆ అటెండర్ కాలేజీ యాజమాన్యానికి తెలియజేశాడు. దీంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. సిద్దిపేటలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లా మంచ్యాల మండలం ఆరుట్ల గ్రామ పరిధిలోని పీసీ తండాకు చెందిన 21 ఏళ్ల సంతోష్ సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సంతోష్ తనకు మరదలు వరస అయిన అమ్మాయిని ప్రేమించాడు. కానీ ఆ యువతికి ఇష్టం లేకపోవడంతో అతడిని దూరం పెట్టింది. దీంతో సంతోష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గురువారం ఉదయం సెమిస్టర్ మొదటి ఏడాది పరీక్షలు రాసేందుకు హాస్టల్ నుంచి కాలేజీ వద్దకు వచ్చాడు. అయితే సగం దూరం వచ్చాక హాల్ టికెట్ మర్చిపోయానని ఫ్రెండ్స్ కు చెప్పి మళ్లీ తిరిగి తన గదికి వెళ్లాడు. పరీక్ష ప్రారంభం అయినా సంతోష్ రాకపోవడంతో, కాలేజీ అటెండర్ ను అతడి గదికి పంపించారు. అతడు వెళ్లి చూసేసరికే సంతోష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురించి తెలిసి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అతడి వద్ద ఓ సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు.
‘ప్రేమించిన అమ్మాయి నన్ను కాదంది. నా ప్రేమను తిరస్కరించింది. ఆమె గుర్తుగా దాచుకున్న సినిమా టికెట్, లాకెట్ మరికొన్ని వస్తువులు నా సూట్ కేసులో ఉన్నాయి. వాటిని ఆ అమ్మాయికి తిరిగి ఇవ్వండి. అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి. ఫ్రెండ్స్.. గుడ్ బై‘ అంటూ సంతోష్ ఆ సూసైడ్ లేఖలో రాశాడు. అతడి ఆత్మహత్య గురించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.