ఖమ్మం: మేనత్త కూతురిని ప్రేమించాడు. పెద్దలు ఒప్పుకోవడంతో ఘనంగా పెళ్లి జరిగింది. కానీ.. పెళ్లయిన 38 రోజులకే ఆ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ విషాద ఘటన ఖమ్మం నగర పరిధిలోని వైఎస్‌ఆర్‌నగర్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తల్లాడ మండలం కలకొడిమకు చెందిన పుష్ప, ఆదూరి సాల్మన్‌రాజు భార్యాభర్తలు. వీళ్ల కొడుకైన సన్ని(21) మేనత్త కూతురిని ప్రేమించాడు. ఆమె కూడా ఇతనిని ఇష్టపడింది. బీటెక్ పూర్తి చేసిన సన్ని మధిరలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో సంవత్సరం నుంచి పని చేస్తున్నాడు. 38 రోజుల క్రితం మేనత్త కూతురితో సన్ని పెళ్లి జరిగింది. కల్యాణ లక్ష్మీ పథకానికి దరఖాస్తు చేసుకునే పనిమీద భార్యను తీసుకుని శనివారం రోజు అత్తగారింటికి వెళ్లాడు. వెళ్లిన కొంతసేపటికి పని ఉందని, మళ్లీ వస్తానని చెప్పి బయటకు వెళ్లాడు.
అలా వెళ్లిన సన్ని గంటలు గడుస్తున్నా తిరిగి రాలేదు. దీంతో.. కంగారు పడిన సన్ని భార్య మౌనిక, అత్త అన్ని చోట్లా వెతికారు. ఎక్కడా సన్నీ జాడ దొరకలేదు. ఈ క్రమంలోనే.. తాను పనిచేస్తున్న కంపెనీలో వేధింపులు ఎక్కువయ్యాయని, అందుకే బతకలేక చనిపోతున్నానని, ఆ కంపెనీ మేనేజ్‌మెంట్‌ను వదలొద్దని తన బావకు సందేశం పంపాడు. తన భార్యను బాగా చూసుకోవాలని సన్ని పంపిన మెసేజ్ చూసి రైలు పట్టాలపై ఉన్నట్లు గుర్తించి హుటాహుటిన అక్కడకు వెళ్లగా అప్పటికే సన్ని ప్రాణాలు కోల్పోయాడు. గూడ్స్ రైలు కింద పడి చనిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. జీఆర్పీ ఎస్‌ఐ రవికుమార్ ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో సన్ని మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. పెళ్లయిన 38 రోజులకే సన్నీ ఇలా ప్రాణాలు తీసుకోవడంతో అతని భార్య మౌనిక గుండెలవిసేలా రోదించింది.
ఇక.. తనకు దిక్కెవరంటూ ఏడుస్తున్న ఆమెను చూసి స్థానికులకు కళ్లు చెమ్మగిల్లాయి. సన్ని కుటుంబం 2014 నుంచి ఖమ్మంలోని వైఎస్‌ఆర్ కాలనీలో ఉంటున్నారు. ఈ ఏడాది మొదట్లో సొంతూరికి వెళ్లిపోయారు. కొడుకు పెళ్లి తర్వాత మళ్లీ ఖమ్మానికి వచ్చి ఉంటున్నారు. సెప్టెంబర్ 2న సన్నీ తన మేనత్త కూతురిని పెళ్లి చేసుకున్నాడు. సన్నీ భార్య మౌనిక తండ్రి ఆమె చిన్నతనంలోనే చనిపోయాడు. దీంతో.. తల్లే మౌనికకు అన్నీ తానై కష్టపడి పెంచింది. బావను పెళ్లి చేసుకుంటానని మౌనిక చెప్పగా.. ఆమె తల్లి కూతురి సంతోషం కోసం ఆనందంగా ఒప్పుకుంది. కానీ.. పెళ్లయి రెండు నెలల కూడా గడవక ముందే కూతురి జీవితంలో ఇలాంటి దుర్ఘటన జరుగుతుందని ఆ తల్లి కలలో కూడా ఊహించలేదు. సన్నీ పనిచేస్తున్న కంపెనీ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. సన్నీతో పాటు పనిచేసిన తోటి ఉద్యోగులను ఆ కంపెనీలో పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: After marriage, Husband commits suicide, Khammam, Latest news, Telangana crime news