‘నాన్నా.. నన్ను క్షమించు. మిమ్మల్ని కాదని వీడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. భవిష్యత్తు గురించి ఎంతో ఊహించుకున్నా. కానీ నేను మోసపోయాను. నన్ను మోసం చేశాడు. ఈ మోసాన్ని భరించలేకపోతున్నా. అందుకే మీ నుంచి దూరంగా శాశ్వతంగా వెళ్లిపోతున్నా’.. ఇదీ ఓ 20 ఏళ్ల యువతి తన తండ్రికి పంపిన ఆఖరు మెసేజ్. ‘ఓరేయ్, అన్నయ్యా.. నేను ఏ తప్పూ చేయలేదురా. ప్రాణంగా ప్రేమించిన వాడే మోసం చేశాడు. పెళ్లి పేరుతో నాతో ఆటలు ఆడాడు. కలిసి కాపురం చేసేందుకు ఇంకా రెండేళ్లు ఆగమంటున్నాడు. నేను మోసపోయా. నన్ను క్షమించరా. చనిపోతున్నా’.. ఇది ఓ యువతి తన అన్నయ్యకు పంపించిన చివరి వీడియో మేసేజ్. సోషల్ మీడియాలో పరిచయం అయిన ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి, చివరకు ఇలా కన్నుమూసింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ లోని మీర్ పేటకు చెందిన ఐశ్వర్య అనే 20 ఏళ్ల యువతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంటుంది. ఆమెకు మియాపూర్ కు చెందిన మారెడ్డి ఆశిర్ అనే 21 ఏళ్ల కుర్రాడు ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు. అతడు ఖైరతాబాద్ లో ఓ టెలీకాలర్ గా పనిచేస్తుంటాడు. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి చివరకు ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చింది. తమ ప్రేమ గురించి ఇంట్లో తెలిస్తే పెళ్లికి ఒప్పుకోరని ఐశ్వర్య చివరకు ఓ కఠిన నిర్ణయమే తీసుకుంది. పెద్దలకు తెలియకుండా గతేడాది ఫిబ్రవరి 20వ తారీఖున సంఘీ టెంపుల్ లో ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఓ గదిని అద్దెకు తీసుకుని కాపురం మొదలు పెట్టారు. అయితే పెళ్లయిన నాటి నుంచే ఉద్యోగం మానేసిన ఆశిర్, ఏ పనీ చేయకుండా ఇంట్లోనే ఉండేవాడు. వారి ప్రేమ పెళ్లి గురించి తెలిసిన ఆమె తల్లిదండ్రులు వారి వద్దకు వచ్చి, ముందుగా జీవితాల్లో సెటిల్ అవండంటూ, చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోండంటూ హెచ్చరించి, ఐశ్వర్యను తమతో పాటు తీసుకెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: ఏడాది క్రితం పెళ్లయిన కూతురిని ఇంటికి పిలిచి.. అందరం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నామని చెప్పిన తండ్రి.. చివరకు..
ఆశిర్ ను తననుంచి తల్లిదండ్రులు దూరం చేస్తున్నారన్న భావనకు వచ్చేసిన ఐశ్వర్య, కొద్ది రోజుల క్రితం మళ్లీ ఇంటి నుంచి బయటకు వచ్చి, బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేటు హాస్టల్ లో ఇద్దరు స్నేహితులతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలోనే త్వరలోనే కలిసి ఉందామంటూ ఆశిర్, ఆమెతో శారీరకంగా మరోసారి దగ్గరయ్యాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఆశిర్ కు చెబితే, కలిసి ఉండే విషయమై సమాధానాన్ని దాటవేశాడు. ఆమెను బలవంతంగా ఒప్పించి గర్భాన్ని తీసేయించాడు. చివరకు నేరుగా అతడి ఇంటికి వెళ్తే.. రెండేళ్ల తర్వాత ఆలోచిస్తామంటూ ఆశిర్ తల్లి తేల్చిచెప్పింది. ఆశిర్ కూడా దాటవేత దోరణిని అవలంబించడంతో ఐశ్వర్య మనస్తాపానికి గురయింది. తన హాస్టల్ కు తిరిగి వచ్చి, గదిలోకి వెళ్లింది. తండ్రికి, అన్నకు, భర్త ఆశిర్ కు వేరువేరుగా వీడియో మెసేజ్ లను పంపించింది. ఆ తర్వాత గదిలో ఉన్న ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయింది. ఆమె వీడియో మేసేజ్ లను చూసిన తండ్రి, వెంటనే అదే హాస్టల్లో ఉంటున్న ఆమె స్నేహితులను అలెర్ట్ చేశాడు. వాళ్లు ఆమె గదికి వచ్చి చూసేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: మేడమీద గదిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. అర్ధరాత్రి అక్క అదృశ్యం.. తల్లిదండ్రులతో కలిసి ఆమె కోసం వెతుక్కుంటూ వెళ్తే..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.