సంక్రాతి పండగ వచ్చిందంటే చాలు.. అంతటా గాలి పటాల సందడి ఉంటుంది. దేశమంతా వేర్వేరు పేర్లతో పండగ జరుపుకున్నా పంతగులు మాత్రం కామన్. పొంగల్ పండగ వేళ దేశమంతటా పతంగులు ఎగురవేస్తుంటారు. ఐతే గాలిపటాలకు కట్టే మాంజాతో ఏటా ఎన్నో పక్షులు చనిపోతున్నాయి. మాంజాలు పక్షుల గొంతుకు చుట్టుకొని.. ఉరితాళ్లుగా మారుతున్నాయి. ప్రతి పండక్కి పక్షులను బలితీసుకుంటున్నాయి. ఇన్నాళ్లు పక్షులే చనిపోయాయి.. కానీ ఇప్పుడు మనుషులు కూడా మరణిస్తున్నారు. మాంజాతో గొంతు తెగి ఓ యువకుడు మరణించాడు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. పండగ వేళ కుటుంబంలో విషాదం నింపింది.
మృతుడిని అజ్నిలోని ధ్యానేశ్వర్ నగర్‌కు చెంది ప్రణయ్ ప్రకాశ్ మంగళవారం తన తండ్రితో కలిసి పనిమీద బయటకు వెళ్లారు. పని ముగిసిన తర్వాత ఇద్దరూ వేర్వేరు బైక్‌లపై తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇద్దరూ జట్టారోడి స్క్వేర్ దాటుతున్న సమయంలో.. ప్రణయ్ మెడకు పదునైన పతంగి దారం చుట్టుకుంది. బైక్‌పై వేగంగా వెళ్లడం.. మాంజా పదునుగా ఉండడంతో.. ప్రణయ్ గొంతు తెగింది. క్షణాల్లోనే బైక్‌పై నుంచి అతడు కిందపడిపోయాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రణయ్ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, పంతంగి మాంజాను గాజు పొడి, నైలాన్ దారంతో తయారు చేస్తున్నారు. వీటిని వాడడం వలన ఆ దారం చాలా పదునుగా ఉంటుంది. చైనా నుంచి ఇలాంటి మాంజాలు ఎక్కువగా దిగుమతి అవుంటాయి. గాలి పటాలు ఎగరవేసే సమయంలో ఈ మాంజా చుట్టుకొని పావురాలు, పిట్టలు మరణిస్తున్నాయి. ప్రతి ఏటా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. జంతు హక్కుల సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ఐతే మాంజా వినియోగంపై ఇప్పటికే చాలా రాష్ట్రాలు నిషేధం విధించాయి. ప్రమాదరకరమైన చైనా మాంజాను వాడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఐనా జనాలు పట్టించుకోకుండా ఇలాంటి పదునైన దారాలతోనే పంతగులు ఎగురవేస్తూ.. ప్రమాదాలకు కారణమవుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:January 12, 2021, 21:59 IST