దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో చోట మహిళలు, బాలికలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ పనిమనిషిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అల్వీష్, నోలెజ్ ప్రేమ్‌గా గుర్తించారు. వీరిలో అల్వీష్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, ప్రేమ్ హౌస్ కీపింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు. వివరాలు.. జార్ఖండ్‌కు చెందిన 20 ఏళ్ల యువతి ఏడేళ్ల కిందట ఢిల్లీకి వచ్చింది. పూనమ్ అనే మహిళ ఆ యువతిని ఢిల్లీకి తీసుకొచ్చి పనిచేయించుకుంది. యువతి డబ్బులు అడిగిన సందర్భాల్లో పూనమ్ ఆమెను కొట్టేంది.
ఆ తర్వాత బాధిత యువతికి నిషా అనే యువతితో పరిచయం ఏర్పడింది. నిషా ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రేమ్ సోదరి. ఈ క్రమంలోనే అల్వీష్ ఇంట్లో యువతికి పని కల్పించడానికి ప్రేమ్ సాయం చేశాడు. అయితే ఆ తర్వాత అల్వీష్, ప్రేమ్‌లు యువతిని రేప్ చేశారు. అయితే ఈ ఘటన ఆదివారం చోటుచేసుకున్నప్పటికీ.. బాధిత యువతి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకన్న పశ్చిమ ఢిల్లీలోని ఠాగూర్ గార్డెన్ పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ప్రస్తుతం నిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుదని తెలిపారు.