ప్రేమలో పడితే అంతేనెహె...! మనం ఏం చేయకున్నా అదే మనతో అన్నీ చేయిస్తుంది.. అంటారు యువతీ యువకులు. కానీ ప్రేమ ఎప్పుడూ తప్పు చేయమని చెప్పదు. అందులో పీకల్లోతు మునిగి.. మైకంలో ఉండేవాళ్లు లోకాన్ని మరిచిపోతుంటారు. ఈ లోకంలో తమను మించిన తోపులు మరెవరూ లేరనుకుంటారు. ప్రేమించిన అమ్మాయిని ఆకట్టుకోవడానికి అవసరమైతే ఆ భగవంతుడితోనైనా కొట్లాడుతామంటారు. తల్లిదండ్రులు ధనవంతులైతోనో.. లేక వారసత్వంగా వచ్చిన ఆస్తి ఏమైనా ఉంటేనో.. ప్రేమ కోసం ఎంత ఖర్చు చేసినా ఏం కాదు. కానీ జేబులో చిల్లి గవ్వ లేనప్పుడు ప్రేమించినవారిని ఆకట్టుకోవాలంటే కష్టంతో కూడుకున్న పనే. అందుకే ఈ ఇద్దరు యువకులు కొత్తదారిని ఎంచుకున్నారు.
మహారాష్ట్రలోని పూణెలో వెలుగులోకి వచ్చిందీ ఘటన. చిఖాలికి చెందిన సాగర్ మోహన్ సవాలే, నీలేశ్ దేవానంద్ అనే యువకులు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్నారు. ఆ ఇద్దరికీ చెరో గర్ల్ ఫ్రెండ్ ఉంది. నిత్యం వారితో కలిసి షికారుకు వెళ్లడం.. వాళ్లు అడిగింది కొనివ్వడం.. సాయంత్రం వాళ్లను ఇంట్లో దింపడం.. ఇది వారి దినచర్య. మరి నిరుద్యోగులుగా ఉన్న వీరికి అంత డబ్బెక్కడ్నుంచి వచ్చింది..?
అక్కడే ఉంది అసలు కిటుకు. మోహన్, నీలేశ్ లు వారి గర్ల్ ఫ్రెండ్ ల ను ఆకట్టుకోవడానికి దొంగతనాలు మొదలుపెట్టారు. వాళ్లిద్దరూ కలిసి సుమారు 26 మొబైల్ ఫోన్లు కొట్టేశారు. కొట్టేసిన ఫోన్లను వారి గర్ల్ ఫ్రెండ్స్ కు చూపించి.. అవి వాళ్లకు నచ్చితే వాటిని వాళ్లకు ఇచ్చేసి.. పాత వాటిని అమ్మేవారు. అమ్మగా వచ్చిన సొమ్మున జల్సాలకు వాడేవారు. ఒక్క మొబైల్ ఫోన్లే కాదు.. బైక్ లు, ఇతర విలువైన వస్తువులను కూడా కొట్టేశేవాళ్లని పోలీసుల విచారణ లో తేలింది.
పక్కా సమాచారంతో వివరాలు అందుకున్న పోలీసులు.. ఆ ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర్నుంచి సుమారు రూ. 3 లక్షలు విలువ చేసే కొన్ని ఫోన్లు, మూడు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను ఈనెల 17 దాకా రిమాండ్ లో ఉంచినట్టు పోలీసు అధికారులు తెలిపారు.
Published by:Srinivas Munigala
First published:January 15, 2021, 23:14 IST