విధి రాత అంటామా, పొరపాటో లేక గ్రహపాటోగానీ, కొన్ని సంఘటనలు అత్యంత బాధ కలిగిస్తూనే అనేక ప్రశ్నలు లేవనెత్తుతాయి. ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతోన్న భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప(21) యుద్ధం జరుగుతోందని తెలిసినా కనీస నిత్యావసర సరుకుల కోసం దుకాణానికి వెళ్లి అనూహ్యరీతిలో రష్యా కురిపించిన తూటాలకు బలైపోయాడు. ఆ టైమ్ లో అతనక్కడ లేకుంటే ఈ విషాదానికి తావుండదనీ కొందరు టీవీ డిబేట్లలో వాదించారు. కానీ కొన్ని విషయాలంతే. నవీన్ సొంత రాష్ట్రం కర్ణాటకలో కొద్ది రోజుల కిందట హిజాబ్ వివాదం కారణంగా స్కూళ్లు, కాలేజీలు మూతపడటం తెలుసుకదా, ఆ సమయంలో తప్పనిసరిగా ఇంటికి వెళ్లిన ఓ విద్యార్థిని అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయింది. అసలు కాలేజీలు మూతపడకుంటే ఆమె ప్రాణాలతోనే ఉండేదేమో మరి!
కర్ణాటకకు చెందిన 17 ఏళ్ల శ్రావ్య పళ్లు తోముకోవడం వల్ల ప్రాణాలు కోల్పోయింది. టూత్ పేస్ట్ అనుకొని పొరపాటున ఎలుకల మందుతో బ్రషింగ్ చేయడంతో అస్వస్తతకు గురై, చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే కన్నుమూసింది. వివరాలివి.. కర్ణాటకలోని సూళ్య జిల్లా మర్కంజా గ్రామానికి చెందిన శ్రావ్య టౌన్ లోని ప్రీయూనివర్సిటీ(ఇంటర్ సమాన) కాలేజీలో చదువుతూ, అక్కడే హాస్టల్లో ఉండేది. గత నెలలో హిజాబ్ వివాదం కారణంగా కర్ణాటకలో అన్ని విద్యా సంస్థలు వారాలపాటు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో అందరు పిల్లల్లాగే శ్రావ్య కూడా ఇంటికి వెళ్లిపోయింది. ఫిబ్రవరి 14న..
సరిగ్గా ఫిబ్రవరి 14న రాత్రి పడుకోబోయే ముందు బ్రషింగ్ చేసుకుంది శ్రావ్య. అయితే ఇంట్లో టూత్ పేస్ట్ ఉండాల్సిన తెల్లని పేస్టు రూపంలోని ఎలుకల మందును పొరపాటున వాడింది. ఎలుకల్ని చంపడానికి వాడే మందు మనుషులపాలిటా విషం లాంటిదే. బ్రషింగ్ చేస్తున్నప్పుడే ఏదో తేడా అనిపించడంతో శ్రావ్య పలు మార్లు నోరు పుక్కలించి కాసేపటి తర్వాత నిద్రపోయింది. కడుపులోకి వెళ్లిన విషం కారణంగా కొన్ని గంటల తర్వాత ఆమె అస్వస్థతకు గురైంది. రోజుల గ్యాప్ లోనే పరిస్థితి క్షీణించడంతో ఫిబ్రవరి 17న శ్రావ్యను మంగళూరులోని ఆస్పత్రికి తరలించారు. రెండు వారాల చికిత్సలోనూ కోలుకోలేకపోయిన ఆమె మొన్న ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచింది.
కర్ణాటకలో 17 ఏళ్ల శ్రావ్య మాదిరిగానే టూత్ పేస్ట్ అనుకొని ఎలుకలమందుతో బ్రషింగ్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తుల తాలూకు ఉదంతాలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 2020, జూన్ లో మన ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం గాలాయగూడెంలో మౌనిక అనే గర్భిణి పేస్ట్ అనుకొని ఎలుకల మందుతో పళ్లుతోమి ప్రాణాలు కోల్పోయింది. కర్నాటకలో ఇలాంటివే మరో మూడు సంఘటనలు, మహారాష్ట్ర , పశ్చిమబెంగాల్ , తెలంగాణలోనూ అరుదుగా ఇలాంటి ఘటనలు జరిగాయి. పేస్ట్ బదులు విషంతో బ్రషింగ్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్నవారిలో దాదాపు అందరూ ఆడవాళ్లే కావడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karnataka, Minor girl, Toothpaste