Crime: షారుక్‌ ఖాన్‌తో పరిచయమన్నాడు..సినిమాల్లో ఛాన్స్ అన్నాడు..చివరికి ఆ యువతిని నమ్మించి..

Photo Credit : ANI

Crime: అతడి మాటలన్నీ నమ్మిన యువతి, సుభాన్‌తో రోజూ చాటింగ్ చేసేది. అమ్మాయితో బాగా పరిచయం పెంచుకున్న తర్వాత.. తనను అపహరించేందుకు సుభాన్ ఒక కథ అల్లాడు. తనకు షారుక్ ఖాన్‌తో మంచి పరిచయం ఉందని, సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పాడు.

  • Share this:
సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పగానే కొందరు యువతులు రెండో ఆలోచన లేకుండా ప్రతి మోసగాడిని నమ్మేస్తుంటారు. తరువాత తాము మోసపోయామని తెలుసుకొని మానసికంగా కుంగిపోతుంటారు. ఇప్పటికే ఇలాంటి దారుణమైన మోసాలు ఎన్నో వెలుగు చూశాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పలశిపర గ్రామంలో జరిగిన సంఘటన కూడా ఇదే కోవలోకి వస్తుంది. గ్రామ నివాసి అయిన ఒక అమ్మాయి 12వ తరగతి చదువుతోంది. ఖాళీ సమయాల్లో ఫేస్‌బుక్‌లో ఎక్కువగా సమయం గడిపేది. అలా ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి, యువతిని అపహరించాలనుకున్నాడు. ఇందుకు ఎన్నో కట్టుకథలు అల్లాడు.ఫేస్‌బుక్‌లో పరిచయమైన సుభాన్ షేక్ అనే వ్యక్తి.. తానొక ఈవెంట్ మేనేజర్‌ని అని యువతితో పరిచయం చేసుకున్నాడు. మహారాష్ట్రలోని మీరా రోడ్‌ ప్రాంతం అతడి స్వస్థలం. తాను ఒక యువకుడిని అని నమ్మించేందుకు 43ఏళ్ల సుభాన్ తన కుమారుడి ఫోటోను ఫేస్‌బుక్ డిస్‌ప్లే పిక్చర్‌గా పెట్టుకున్నాడు. అతడి మాటలన్నీ నమ్మిన యువతి, సుభాన్‌తో రోజూ చాటింగ్ చేసేది. అమ్మాయితో బాగా పరిచయం పెంచుకున్న తర్వాత.. తనను అపహరించేందుకు సుభాన్ ఒక కథ అల్లాడు. తనకు షారుక్ ఖాన్‌తో మంచి పరిచయం ఉందని, సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పాడు. కావాలంటే షారుఖ్‌ను పరిచయం చేస్తానని, తనతో రావాలని యువతిని నమ్మించాడు.

ఇవన్నీ నిజమేనని నమ్మిన యువతి, సుభాన్‌తో వెళ్లేందుకు ఒప్పుకుంది. తన గురించి యువతికి పూర్తిగా తెలియకుండా జాగ్రత్తపడాలనుకున్నాడు. ఇందుకు మరో కథ అల్లాడు. తనకు కరోనా వైరస్ సోకిందని, అందువల్ల మా నాన్నను పంపిస్తున్నానని మెసేజ్ పంపించాడు. దీనికి కూడా అమ్మాయి సరే అంది. జూలై 15న పలశిపర చేరుకున్న సుభాన్.. అమ్మాయిని కోచింగ్ క్లాస్ నుంచి కోల్‌కతాకు తీసుకువెళ్ళాడు. ఎవరూ ట్రాక్ చేయడానికి వీలు లేకుండా మార్గమధ్యంలోనే అమ్మాయి ఫోన్ లోని సిమ్ ని విరగ్గొట్టాడు. తర్వాత హౌరా రైల్వే స్టేషన్‌లో ముంబయికి వెళ్లే ట్రైన్‌లో ఎక్కించాడు.
మరోవైపు తన కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని రైల్వే స్టేషన్లను అప్రమత్తం చేశారు. హౌరా పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిన తర్వాత.. వెంటనే ముంబయి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అమ్మాయి ఎక్కిన ట్రైన్‌కి ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ ఆఖరి స్టాప్ అని ముంబై పోలీసులకు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు బుధవారం అమ్మాయిని రక్షించి నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం ఆ యువతిని ఒక ఆశ్రమానికి తరలించారు. ముంబై రైల్వే పోలీసులు నిందితుడిని దర్యాప్తు నిమిత్తం పశ్చిమ బెంగాల్ పోలీసులకు అప్పగించారు. అయితే నిందితుడు ఏ దురుద్దేశంతో అమ్మాయిని అక్రమంగా రవాణా చేస్తున్నాడనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
Published by:Sridhar Reddy
First published: