ఆడపిల్లలపై అఘాయిత్యాలకు సంబందించి మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పదో తరగతి చదువుతోన్న 16 ఏళ్ల బాలికపై ఆమె కన్నతండ్రి, తోడబుట్టిన అన్నలే అఘాయిత్యానికి పాల్పడ్డారు. తండ్రీకొడుకులు వంతులవారీగా బాలికను పదేపదే అత్యాచారం చేశారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక రెండేళ్లుగా సాగుతోన్న ఈ అకృత్యాన్ని మౌనంగా భరిస్తూ వచ్చిందా అమ్మాయి. అయితే ఇప్పుడా కీచకులు చిన్న కూతురుపైనా కన్నేశారు. తన జీవితంలాగా చెల్లెలి జీవితం నరకం కావొద్దనే ఉద్దేశంతో ఎట్టకేలకు ఆ పాప ధైర్యం చేసింది. ఇంట్లో తండ్రీ, అన్నలు తన పట్ల సాగిస్తోన్న వికృతాన్ని స్కూల్ టీచర్ కు చెప్పుకొని బోరున విలపించింది. స్కూల్ ప్రిన్సిపల్ సహకారంతో ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంచలనం రేపిన ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం..
16 ఏళ్ల బాలికను పలుమార్లు అత్యాచారం చేసిన కేసులో ముంబైకి చెందిన 43 ఏళ్ల వ్యక్తి, అతని కొడుకైన 20 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో వాళ్లిద్దరూ నేరాన్ని అంగీకరించడంతో సంబంధిత సెక్షన్ల కింద కేసులు పెట్టి, కోర్టులో హాజరుపర్చగా, జడ్జి రిమాండ్ విధించారు. ఈ దారుణకాండ గత రెండేళ్లుగా కొనసాగుతున్నట్లు పోలీసులు చెప్పారు. బాధిత బాలిక చదువుతోన్న స్కూల్ టీచర్, ప్రిన్సపల్, ఓ ఎన్జీవో సహకారంతో తమను సంప్రదించారని పోలీసులు తెలిపారు. ఈ దారుణకాండపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు వివరాలను పోలీసులు వెల్లడించారు.
బాలిక ఎనిమిదో తరగతిలో ఉండంగా, 2019 జనవరిలో తొలిసారి ఆమెపై అత్యాచారం జరిగింది. ఇంట్లో తన గదిలో నిద్రపోతున్న బాలికపై కన్నతండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను రహస్యంగా చూసి అవకాశంగా భావించాడేమోగానీ, అదే నెలలలో సోదరుడు(20) కూడా బాలికను చెరపట్టాడు. అప్పటి నుంచి తండ్రీకొడుకులు మార్చిమార్చి బాలికను తరచూ రేప్ చేస్తుండేవారు. నాన్న, అన్నయ్యల కీచకపర్యాన్ని ఏళ్ళపాటు మౌనంగా భరించిందా అమ్మాయి. అయితే, ఇప్పుడా కీచకుల కన్ను చిన్న కూతురిపై పడింది.
తండ్రి, అన్నలు తన చిన్న చెల్లెల్ని కూడా ఎక్కడ పాడుచేస్తారోననే భయం బాలికను కొంతకాలంగా వేధించసాగింది. ఈక్రమంలోనే కొద్దిగా ధైర్యం చేసి తాను చదువతోన్న స్కూల్లో టీచర్ కు ఈ విషయాన్ని చెప్పింది. వెంటనే ఆ టీచర్ ఇష్యూను ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు. స్కూల్ టీచర్లు తమకు తెలిసిన ఓ బాలల సంరక్షణ ఎన్జీవో వారిని సంప్రదించారు. అంతా కలిసి బాలికకు ధైర్యం చెప్పి, ఆమెతో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకుని విచారించగా, వాళ్లు నేరాన్ని అంగీకరించారని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామని పోలీసులు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Minor girl, Minor girl raped, Mumbai, Mumbai Police