దొంగలతో తలపడిన బాలిక.. చొక్కాపట్టి.. బైక్‌పై నుంచి లాగేసి..

15 ఏళ్ల ఆ యువతి గుండె ధైర్యానికి అందరూ ఫిదా అవుతున్నారు. శభాష్ కుసుం.. అమ్మాయిల సత్తా ఏంటో చూపించావంటూ మెచ్చుకుంటున్నారు.

news18-telugu
Updated: September 1, 2020, 7:58 PM IST
దొంగలతో తలపడిన బాలిక.. చొక్కాపట్టి.. బైక్‌పై నుంచి లాగేసి..
దొంగలతో తలపడిన బాలిక.. చొక్కాపట్టి.. బైక్‌పై నుంచి లాగి..
  • Share this:
అది పంజాబ్‌లోని జలంధర్ పట్టణం.
శుక్రవారం మధ్యాహ్నం 03:22 గంటల సమయం.

పట్టపగలు నడిరోడ్డుపై దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న బాలికను టార్గెట్ చేసి సెల్‌ఫోన్ దొంగిలించే ప్రయత్నం చేశారు. బైక్‌పై ఇద్దరు యువకులు వచ్చారు. వెనక నుంచి ఆ బాలికను ఫాలో అయ్యారు. కాసేపయ్యాక బైక్‌పై వెనక కూర్చున్న యువకుడు బాలిక చేయిపట్టి మొబైల్ లాక్కున్నాడు. వెంటనే అప్రమత్తమైన బాలిక ఆ యువకుడి చొక్కాను పట్టి లాగింది. బైక్ నుంచి కిందకు దిగిన యువకుడు బాలిక జుట్టుపట్టి కొట్టాడు. అంతేకాదు పదునైన ఆయుధంతో మోచేతిపై దాడి చేశాడు. ఐనా భయపడకుండా ఆ బాలిక అతడినితో తలపడింది. చివరకు ఆమెను విదిల్చుకొని మళ్లీ బైక్ ఎక్కబోయాడు. ఐనా అమ్మాయి వదల్లేదు. పట్టువదలని విక్రామార్కుడిలా పోరాడింది. మళ్లీ చొక్కా పట్టి కిందకు లాగింది. కాసేపు వారిద్దరి మధ్య పెనుగులాట జరిగింది. అంతలోనే రోడ్డుపై వెళ్తున్న కొందరు వ్యక్తులు వచ్చి ఆ స్నాచర్‌ను పట్టుకొని దేహశుద్ధి చేశారు. మరో యువకుడు బైక్‌పై పారిపోయాడు. దొరికిన యువకుడిని పోలీసులకు అప్పగించారు. దొంగలతో ప్రాణాలకు తెగించి పోరాడి.. తన సెల్‌ఫోన్‌‌ను తాను దక్కించుకుంది ఆ బాలిక.

స్నాచర్‌తో తలపడిన అమ్మాయి పేరు కుసుం కుమారి. వయసు 15. ఫతేపురి మొహల్లాకు చెందిన బాలిక.. ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దొంగ దాడిలో గాయపడిన ఆ బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయిపై దాడి చేసిన స్నాచర్‌ను బస్తీ ధనష్మంద ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల అవినాష్ కుమార్‌గా గుర్తించారు. అతడు ఇచ్చిన సమాచారంతో పారిపోయిన మరో యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక స్నాచర్‌తో కుసుం కుమారి తలపడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 15 ఏళ్ల ఆ యువతి గుండె ధైర్యానికి అందరూ ఫిదా అవుతున్నారు. శభాష్ కుసుం.. అమ్మాయిల సత్తా ఏంటో చూపించావంటూ మెచ్చుకుంటున్నారు. ఈ బాలిక లాగే అందరూ ధైర్యంగా ఉంటే.. ఏ ఆకతాయి కూడా అమ్మాయిల దగ్గరకు రాడని అభిప్రాయపడుతున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: September 1, 2020, 7:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading