Aurangabad Train Accident : లాక్‌డౌన్ కావడంతో చేతిలో పనిలేకుండా పోయింది.. సొంతూళ్లకు వెళదామని వాళ్లంతా రెడీ అయ్యారు.. ముల్లె మూట సర్దుకొని బయలుదేరారు.. గురువారం నాటికి ఔరంగాబాద్ చేరుకున్నారు.. అప్పటికే రాత్రి కావస్తుండటం, పైగా అలసిపోవడంతో సేద తీరుదాం అనుకున్నారు. ఆ పక్కనే రైల్వే ట్రాక్ కనిపించింది. ఎలాగూ లాక్‌డౌన్ కాబట్టి రైళ్లు రావేమోననుకొని అక్కడే నిద్రకు ఉపక్రమించారు. అందరూ కలిసి ట్రాక్‌నే పడక చేసుకున్నారు. ఉదయాన్నే నిద్ర లేచి ఊళ్లకు వెళదాం అనుకున్నారు. కానీ, వాళ్లు నిద్రలోనే కళ్లు మూస్తాం అనుకోలేదు. ఆ రైల్వే ట్రాకే తమ పాలిట మృత్యువు అవుతుందని ఊహించలేదు. అతి వేగంతో దూసుకొచ్చిన ఓ రైలు వాళ్లందర్నీ చిదిమేసింది. చక్రాల కింద నలిపేసింది. రక్తమాంసాలను పిప్పి చేసేసింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
సొంతూళ్లకు బయలుదేరిన 17 మంది వలస కూలీలు రైలు చక్రాల కింద నలిగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌కు పయనమైన వలస కూలీలు (మధ్యప్రదేశ్ లో పనిచేస్తున్నారు) గురువారం రాత్రి ఔరంగాబాద్‌కు చేరుకున్నారు. రాత్రి కావడంతో రైల్వే ట్రాక్‌పై నిద్రపోయారు. అయితే, ఓ గూడ్స్ రైలు వచ్చే విషయం తెలీక గాఢ నిద్రలోనే ఉండిపోయారు. అంతే.. ఆ రైలు వారిపై నుంచి దూసుకెళ్లడంతో ఆ రైలు చక్రాల కింద నలిగి 17 మంది దుర్మరణం చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఔరంగాబాద్‌కు సమీపంలోని కర్మాద్ ప్రాంతంలో చోటుచేసుకుందీ ప్రమాదం.
కాగా, లాక్‌డౌన్ దెబ్బకు సొంతూళ్లకు పయనమైన వలస కూలీలు అడుగడుగునా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆకలితో అలమటిస్తూ, అనారోగ్య పాలవుతూ ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా.. ఈ దారుణం దేశ ప్రజలను తీవ్రంగా కలచి వేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Maharashtra, National News, Train accident