అంతర్జాతీయ కంపెనీలకు కేంద్రంగా, విశ్వనగరంగా వర్ధిల్లుతోన్న హైదరాబాద్ (Hyderabad) లో ఆడపిల్లపై వరుస అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు వారాల కిందట జూబ్లీ హిల్స్ పబ్బులో పార్టీ తర్వాత ఓ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరగ్గా, మరో పబ్బు పార్టీ తర్వాతి ఘటనలో గుజరాత్ కు చెందిన యువతిపై అత్యాచారం చోటుచేసుకుంది. వీటిపై దర్యాప్తు కొనసాగుతుండగానే జవహర్ నగర్ లో గిరిజన బాలికపై పలుమార్లు అత్యాచారం (Minor Girl Assaulted In Hyderabad) జరిగిన ఉదంతంపై కేసు నమోదైంది. వివరాలివే..
హైదరాబాద్ సిటీని ఆనుకుని ఉండే జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో మరో మైనర్ బాలికపై అఘాయిత్యం ఘటన చోటుచేసుకుంది. జవహర్‌నగర్‌కు చెందిన పద్నాలుగేళ్ల ఓ ఎస్టీ బాలిక తల్లితో కలిసి జీవిస్తోంది. తండ్రి మరణించడంతో తల్లి కూలి పనికి వెళ్తూ పిల్లల్ని పోషిస్తోంది. ఆమె ఇంటి పక్కనే ఉన్న రవి(22) అనే యువకుడు ఆ బాలికపై కన్నేశాడు.
రెండు నెలల క్రితం (ఏప్రిల్ లో) తల్లి కూలి పనికి వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ బాలికపై రవి తొలిసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా విషయం చెబితే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం పలుమార్లు బాలికను రేప్ చేశాడు. ఈ క్రమంలో ఇటీవల బాలికకు కడుపునొప్పి రావడంతో ఆ దుర్మార్గుడు తనకు తెలిసిన ఓ ఆర్ఎంపీ వైద్యుడికి చూపించాడు.
బాలిక వయసును 20 ఏళ్లుగా పేర్కొని, స్కానింగ్ చేయించాడు. బాధితురాలు గర్భం దాల్చినట్లు నిర్ధారణ కావడంతో.. అబార్షన్ చేయించాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. అయితే, అత్యాచారం, అబార్షన్ గురించి బాలిక తల్లికి విషయం తెలియడంతో.. గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జవహర్ నగర్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Hyderabad police, Minor girl, Rape case